Site icon HashtagU Telugu

TDP : కోవ‌ర్టులు, గ్రూప్ పాలిటిక్స్ కు చంద్ర‌బాబు చెక్

CBN Vision 2024

Chandrababu

గెలుపు మీద ధీమా ఉన్న‌ప్పుడు దూకుడు పెంచ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు కూడా మ‌ళ్లీ అధికారంలోకి రాల‌గ‌ల‌మ‌నే ధీమాతో ఉన్నారు. ఆ క్ర‌మంలో గ్రూప్ విభేదాలు ఉన్న చోట స‌రిచేసుకోవ‌డానికి దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. గ‌తంలో మాదిరిగా నాన్చుడి ధోర‌ణికి చెక్ పెడుతూ తోక జాడించిన వాళ్ల‌పై క‌త్తెర వెంట‌నే ప‌డిపోతోంది.

ప్ర‌తి వారం మూడు రోజుల పాటు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు చంద్ర‌బాబు వెళుతున్నారు. ఆ సంద‌ర్భంగా తొలి రోజు బ‌హిరంగ స‌భ పెడుతున్నారు. రెండో రోజు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సమీక్షిస్తున్నారు. మూడో రోజు రోడ్ షోల‌ను విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా క్యాడ‌ర్ కు నూత‌నోత్సాహాన్ని నింపుతున్నారు. ఆ సంద‌ర్భంగా కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రికొన్ని చోట్ల ప‌నిచేసే వాళ్ల‌కు టిక్కెట్ ఇస్తాన‌ని చెబుతున్నారు. గ్రూప్ విభేదాలు ఉండే చోట మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నారు. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కృష్ణా జిల్లా టీడీపీ రాజ‌కీయం. అక్క‌డ ప‌ర‌స్ప‌రం ఎవ‌రికీ పొస‌గ‌డంలేదు. ప్ర‌త్యేకించి గుడివాడ‌, గ‌న్న‌వ‌రం టీడీపీ రాజ‌కీయాన్ని స‌రిచేయ‌లేని ప‌రిస్థితికి చేరింది. అలాగే, ప్ర‌కాశం జిల్లా చీరాల‌, ప‌ర్చూరు, ద‌ర్శి , గిద్ద‌లూరు త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయ‌ని పార్టీ భావిస్తోంది. ఇలాంటివి ఎక్కువ‌గా రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఆయా జిల్లాల్లో గ్రూప్ ల‌కు చెక్ పెట్ట‌డానికి రంగంలోకి దిగిన చంద్ర‌బాబు తొలుత క‌డ‌ప జిల్లా నుంచి ఆప‌రేష‌న్ ప్రారంభించారు. ఆ జిల్లాలోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సాయినాథ్ శ‌ర్మ‌, మైదుకూరు నియోజ‌కవ‌ర్గానికి చెందిన వెంక‌ట‌సుబ్బారెడ్డిల పై వేటు వేశారు వాస్త‌వంగా వాళ్లు పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా ఉన్నారు. అక్క‌డి పార్టీ ఇన్‌చార్జీలను కాద‌ని ప‌లు సంద‌ర్భాల్లో ధిక్కారాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ మేర‌కు అధిష్టానం వ‌ద్ద‌కు ఫిర్యాదులు చేర‌డంతో వెంట‌నే ప్రాథ‌మిక స‌మాచారాన్ని సేక‌రించారు. వాళ్లిద్ద‌రిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిర్థారించుకున్న త‌రువాత వెంట‌నే క‌డ‌ప జిల్లాకు చెందిన సాయినాథ్ శ‌ర్మ‌, వెంకట‌సుబ్బారెడ్డిల‌పై చ‌ర్య‌లు తీసుకుంటూ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇలా మ‌రికొన్ని జిల్లాల్లోనూ ప‌రిస్థితి ఉంద‌ని గ్ర‌హించిన టీడీపీ కోవ‌ర్టుల‌ను, గ్రూప్ ల‌ను న‌డిపే వాళ్ల‌ను ఏరిపారేస్తోంది.