Site icon HashtagU Telugu

TDP Caste Card: చంద్ర‌బాబు సంకుల `చెప్పు` స‌మ‌రం

CBN Target

naidu TDP

`స‌మాజంలో రెండే కులాలు ఉన్నాయి. ఒక‌టి పేద రెండు ధ‌నిక` అంటూ ప‌లుమార్లు టీడీపీ అధినేత చంద్ర‌బాబు బహిరంగ వేదిక‌ల్లో చెప్పారు. `వ‌స్తున్నా మీ కోసం యాత్ర` సంద‌ర్భంగా 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో `నేను పెద్ద మాదిగ‌`ను అంటూ ప‌లుమార్లు చెప్పారు. కులంలేని రాజ‌కీయం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్తానం కూడా ఆ పంథాలోనే న‌డిచింది. సొంత కుల‌పోళ్ల‌ను చంద్ర‌బాబు న‌మ్మ‌డ‌ని చాలా కాలంగా ఆయ‌న మీద ముద్ర ఉంది. కేవ‌లం కొద్ది మందిని మాత్ర‌మే వెనుకేసుకొస్తార‌ని పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ ఎప్పుడూ ఉంటుంది. ఆ పార్టీ గురించి నిశితంగా ప‌రిశీలిస్తే, సంస్థాగ‌త ప‌ద‌వుల్లో కూడా సామాజిక న్యాయం అంటూ పైకి రానివ్వ‌లేద‌ని పార్టీలోని సొంత‌కుల‌పోళ్లు త‌ర‌చూ మాట్లాడుకుంటారు. పార్టీ టిక్కెట్లు, మంత్రి ప‌ద‌వులు, నామినేటెడ్‌, రాజ్య‌స‌భ , ఎమ్మెల్సీ త‌దిత‌ర ప‌ద‌వుల‌కు ఆయ‌న కులానికి చెందిన వాళ్ల‌ను ప‌లుమార్లు దూరంగా పెట్టారు. అంతేకాదు, నంద‌మూరి కుటుంబానికి కూడా ప్రాధాన్యత‌ కింద ఏనాడూ తీసుకోలేద‌నే అపవాదు ఆయ‌న‌పై ఉంది. ఇక తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. 40ఏళ్ల చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితాన్ని ప‌రిశీలిస్తే, య‌న‌మ‌ల‌, దేవేంద‌ర్ గౌడ్, బాల‌యోగి, యర్రంనాయుడు, మందా జ‌గ‌న్నాథం, అశోక్ గ‌జ‌ప‌తి రాజు, కేసీఆర్, పెద్దిరెడ్డి, చంద్ర‌మోహ‌న్‌ రెడ్డి, అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే క‌మ్మేత‌ర కుల‌పోళ్ల‌కు ప్రాధాన్యత ఇచ్చిన జాబితా చాంతాడంత‌. ఉద్దేశ‌పూర్వ‌కంగా చంద్ర‌బాబు సొంత కుల‌పోళ్ల‌ను దూరంగా పెడ‌తార‌ని సీనియ‌ర్ల‌ను ఎవ‌ర్ని అడిగిన‌ప్ప‌టికీ చెబుతారు.

నాలుగు ద‌శాబ్దాలుగాలేని `కులం` కార్డ్ ను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్ర‌త్య‌ర్థులు త‌గిలిస్తున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి వెనుక‌బ‌డిన కులాలు వెన్నంటి ఉన్నాయి. ఆ త‌రువాత చంద్ర‌బాబు చేతుల్లోకి వ‌చ్చిన టీడీపీ అదే పంథా కొన‌సాగింది. వేళ్ల మీద లెక్క‌పెట్టే క‌మ్మ నేత‌లు మాత్ర‌మే తెలుగుదేశం సింహం భాగంలో క‌నిపిస్తారు. వాళ్లు కూడా పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌లు, కాంట్రాక్ట‌ర్ల ముసుగులో చొర‌బ‌డిన నాయ‌కులే. ఇటీవ‌ల ఆ నాయ‌కులు కూడా పార్టీకి దూరం అయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే బ్యాచ్ అది. అలాంటి బాప‌తు అన్ని పార్టీల్లోనూ క‌నిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెనుక‌బ‌డిన కులాల ఓటు బ్యాంకు ఎప్పుడూ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప‌నిచేసింది. ఇప్ప‌టికీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అంటే ప్రాణంపోయేలా పోరాడే బీసీలు ఉన్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో క‌నిపిస్తోన్న బీసీ నాయకులు దాదాపుగా అంద‌రూ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే. ఏపీలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, ఎస్సీల్లోని మాదిగ సాలిండ్ గా టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉండేదని అంచ‌నా. 2019 ఎన్నిక‌ల్లో బీసీ ఓటు బ్యాంకు చీలిపోవ‌డంతో తొలిసారిగా ఘోర అవ‌మానాన్ని టీడీపీ ఎదుర్కొంది.

కులాల కుంప‌ట్లో న‌లిగిపోతున్న ఏపీ గురించి చంద్ర‌బాబు తాజాగా మ‌థ‌న‌ప‌డుతున్నారు. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒంగి దండంపెట్టిన‌ప్ప‌టికీ న‌మ్మ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. కులం కార్డ్ ను టీడీపీకి త‌గిలించాల‌ని చూస్తే రాష్ట్రం న‌ష్ట‌పోతుంద‌ని ఆయ‌న తాజాగా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. తెనాలి నియోజ‌క‌వ‌ర్గం స‌మావేశంలో ఏపీలోని కులం కంపును క‌డిగేసే ప్ర‌య‌త్నం ఆయ‌న చేశారు. అంతేకాదు, చంద్ర‌బాబు నైజానికి భిన్నంగా `కులం పేరు ఎత్తితే.. చెప్పు చూపించండి` అంటూ ఆగ్ర‌హించారు. ఇదంతా చూస్తుంటే, ప్ర‌త్య‌ర్థి పార్టీలు టీడీపీ మీద కులం ముద్ర‌ను వేయ‌డానికి బాగా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అర్థం అవుతోంది. అందుకే, చంద్ర‌బాబు ముందుగా మేల్కోని దానికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి `చెప్పు` ను బ‌య‌ట‌కు తీశార‌న్న‌మాట‌.