Chandrababu : ప్ర‌జా ఉద్య‌మానికి `హైటెక్‌` ఎత్తుగ‌డ‌

`సింహం ఒక అడుగు వెన‌క్కువేసినంత మాత్రాన భ‌య‌ప‌డుతుంద‌నుకుంటే పొర‌బాటే. అలాగే, త‌ల‌పండిన రాజ‌కీయ‌వేత్త మౌనంగా ఉన్నాడంటే చేత‌గాద‌ని అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 04:53 PM IST

`సింహం ఒక అడుగు వెన‌క్కువేసినంత మాత్రాన భ‌య‌ప‌డుతుంద‌నుకుంటే పొర‌బాటే. అలాగే, త‌ల‌పండిన రాజ‌కీయ‌వేత్త మౌనంగా ఉన్నాడంటే చేత‌గాద‌ని అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే.` ఇదే సూత్రాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అన్వ‌యిస్తే, ఆయ‌న రాజ‌కీయ జీవితం క్లోజ్ అంటూ ప్ర‌త్య‌ర్థులు అనుకుంటే త‌ప్ప‌ట‌డ‌గు వేసిన‌ట్టే. తాజాగా ఏపీలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ఆయ‌న్ను ఆహ్వానించ‌క‌పోవ‌డాన్ని వైసీపీ విజ‌యంగా భావిస్తోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాక‌చ‌క్యంగా భావిస్తోంది. కేంద్రం జ‌గ‌న్ కు ఇస్తోన్న ప్రాధాన్య‌త‌ను నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు రాబోవు రోజుల్లో బ‌ల‌హీనం కావ‌డం త‌థ్య‌మ‌ని వైసీపీ భావిస్తోంది. కానీ, `అల్లూరి`విగ్ర‌హం ప్రొటోకాల్ ను బేస్ చేసుకుని సానుకూల వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసుకునే ప‌నిలో టీడీపీ ఉంద‌న్న విష‌యం జ‌గ‌న్ టీమ్ కు బోధ‌ప‌డ‌డంలేదు.

ఇటీవ‌ల దాకా పొత్తుల గురించి మాట్లాడిన ప‌వ‌న్ కు మ‌రో ఆప్ష‌న్ లేకుండా `అల్లూరి` విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ చేసింది. వ‌న్ సైడ్ ల‌వ్ అంటూ కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ప్ప‌టి నుంచి పొత్తుల అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎన్నిక‌లు ఇప్ప‌టికిప్పుడు లేక‌పోయిన‌ప్ప‌టికీ పొత్తుల అంశాన్ని ప‌దేప‌దే ప‌వ‌న్ చెబుతూ వ‌స్తున్నార‌. పార్టీ 8వ ఆవిర్భావ స‌భ సందర్భంగా ప్ర‌జా వ్య‌తిరేక ఓటును చీలిపోనివ్వ‌నంటూ మాట్లాడారు. అంతేకాదు, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని అన్నారు. ఆ మాట‌ల త‌రువాత మూడు ఆప్ష‌న్లు జ‌న‌సేన ముందున్నాయ‌ని చెప్పుకొచ్చారు. బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్ల‌డం, బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో ప‌నిచేయ‌డం, జ‌న‌సేన ఒంటిరిగా పోరాటం చేయ‌డ‌మంటూ ఆప్ష‌న్ల‌ను చెప్పారు. తాజాగా ప్ర‌జ‌ల‌తో పొత్తు అంటూ చివ‌రి ఆప్ష‌న్ తీసుకున్నారు. అందుకు అనుగుణంగా బీజేపీ కూడా ఆయ‌న్ను పక్క‌న ప‌డేసింది. ఆ విష‌యం `అల్లూరి` విగ్ర‌హావిష్క‌ర‌ణ వేదిక స్ప‌ష్టం చేసింది. దీంతో బీజేపీ, జ‌న‌సేన భవిష్య‌త్ లో క‌లిసే ఛాన్స్ లేద‌ని అర్థం అవుతోంది.

ఇప్పుడ అనివార్యంగా టీడీపీతో క‌లిసి జ‌న‌సేన వెళ్లే ఆప్ష‌న్ మాత్ర‌మే ఉంది. లేదంటే ఒంటిరిగా వెళితే, ఆ పార్టీ బ‌లం ఎంతో ప‌వ‌న్ కు బాగా తెలుసు. అందుకే, ఇప్పుడు చంద్ర‌బాబు మౌనంగా ఉన్నారు. పొత్తు ఊసు ఎత్త‌డానికి అయిష్టంగా ఉన్నారు. పార్టీ లీడ‌ర్ల‌కు కూడా పొత్తుల గురించి ప్ర‌స్తావ‌న తీసుకురావ‌ద్ద‌ని సంకేతాలు ఇచ్చార‌ని తెలుస్తోంది. ఒంగోలు మ‌హానాడు త‌రువాత టీడీపీ అగ్ర‌నేత‌ల ఆలోచ‌న మారిపోయింది. పైగా జ‌న‌సేన వాల‌కం త‌మ్ముళ్ల‌కు త‌ల‌నొప్పిగా మారింది. దీంతో ఒంటరిగా వెళ్ల‌డానికి చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయి వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిల‌ను కూడా నియ‌మిస్తున్నారు. దీంతో ఇక జ‌న‌సేన‌తో పొత్తుకు దాదాపుగా దూరంగా ఉన్న‌ట్టే. మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చంద్ర‌బాబు వ్యూహాల‌ను ర‌చిస్తూ ప్ర‌తి అంశాన్ని అనుకూలంగా తిప్పుకునే చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వైసీపీ ప్లీన‌రీ 8,9 తేదీల్లో జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత నుంచి క్షేత్ర‌స్థాయిలోని అవినీతి, అక్ర‌మాల గురించి టీడీపీ వెలుగెత్తి చాట‌నుంది. అంతేకాదు, జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో మోడీ ఏ విధంగా అంట‌కాగుతుందో తెలియ‌చేయ‌బోతున్నారు. ఫ‌లితంగా కేంద్రం, రాష్ట్రంపై ఉండే వ్య‌తిరేక ఓటును గంప‌గుత్త‌గా పార్టీకి అనుకూలంగా మ‌లుచుకునే వ్యూహాన్ని ర‌చిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీతో ఉన్న జ‌న‌సేన పార్టీని ప‌రోక్షంగా కార్న‌ర్ చేస్తూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని టీడీపీ స్కెచ్ వేస్తోంది. అందుకోసం డిజిట‌ల్ స్క్రీన్ల‌ను ఉప‌యోగించి ప్ర‌తి గ్రామంలోనూ ప్ర‌చారం చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. అక్టోబ‌ర్ 2 లేదా ఆ త‌రువాత లోకేష్ పాద‌యాత్ర ఒక వైపు చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర ఇంకో వైపు ఉండేలా ప్ర‌ణాళిక సిద్ధం అవుతోంది. ఒక వేళ జ‌న‌సేన‌తో క‌లిసి వెళితే, కేంద్రంపై ఉన్న వ్య‌తిరేక‌త‌పై మాట్లాడేందుకు టీడీపీకి వెసుల‌బాటు ఉండ‌దు. అందుకే, ఆ పార్టీని దూరంగా పెట్ట‌డం ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేస్తూ డిజిట‌ల్ స్క్రీన్ల ప్ర‌చారాన్ని హోరెత్తించాల‌ని స్కెచ్ వేస్తున్నారు చంద్ర‌బాబు. ఎంత వ‌ర‌కు ఆయ‌న ఆలోచ‌న ప‌నిచేస్తుందో చూడాలి.