Site icon HashtagU Telugu

TDP : అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.. కార్యకర్తల త్యాగాలు మరిచిపోను : చంద్రబాబు నాయుడు

TDP

TDP

కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకు, తెలుగు దేశం పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని.. అరెస్టులు చేసి జైలుకు పంపారని చంద్రబాబు అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదరక బెదరక పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడ్డారని.. వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. ప్రశాంతమైన కుప్పంలో వికృత రాజకీయాలతో ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తన పర్యటనకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలపైనా కేసులు పెట్టి వేధించారని.. 35 ఏళ్లుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తన అక్రమ అరెస్టు సమయంలో మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కుప్పం నియోజవకర్గం నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన కార్యక్రమాలకు దిగినవారిపైనా తప్పుడు కేసులు పెట్టారని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. అధినేత కోసం ఎన్ని కేసులు, ఇబ్బందులు అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, ఓటర్ వెరిఫికేషన్ వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను నేతలు చంద్రబాబు నాయుడుకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని కుప్పం నేతలు చంద్రబాబుకు తెలిపారు.

Also Read:  TDP : రైతాంగాన్ని ఆదుకోండి.. పంట నష్టం అంచనకు వచ్చిన కేంద్ర బృందానికి టీడీపీ నేతల వినతి