TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు

జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 06:58 AM IST

జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి తూ.గో జిల్లా తునిలో నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నీతి నిజాయితీ మంచితనానికి మారుపేరు తూ.గో జిల్లా అని.. రాష్ట్రంలో రాజకీయం మారిందనేదానికి ఈ తుని సభే సాక్ష్యమ‌న్నారు. మరో 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారని.. అహంకారం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడ‌న్నారు. జగన్ రెడ్డి అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్ధితి నెలకొందని.. ఎన్నికల ముందు మీ కాళ్లు పట్టుకుని ఒక్క చాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడ‌ని ఆరోపించారు. ఊర్లు, ఊర్లు ఏకమై వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుదంతో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్ది రాతియుగం పోయి తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం తెలుగుజాతికి రావాలని నూతన సంవత్సరంలో సంకల్పించాన‌న్నారు. వచ్చే ఎన్నికలు అహంభావంతో విర్రవీగుతున్న జగన్ కి 5 కోట్ల మందికి జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు గానీ నిత్యావసర ధరలు అన్నీ పెరిగాయన్నారు. టీడీపీ హయాంలో రూ. 70 ఉన్న పెట్రోల్ నేడు రూ. 110కి పెరిగిందని.. డీజిల్ రూ. 70 నుంచి రూ. 99 కి పెరిగిందన్నారు.నిత్యవసర ధరలు మండిపోతుంటే ప్రజలు పండుగ చేసుకునే పరిస్ధితిలో లేరన్నారు. సంక్షేమం, అభివృద్దితో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది టీడీపీనేన‌ని.. పేదల్ని ఆదుకునే బాధ్యత త‌న‌దేన‌న్నారు. అన్న క్యాంటీన్లు మళ్లీ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చుతామ‌ని… టీటీడీలో కూడా భక్తులకు నాసిరకం భోజనం పెట్టడం దుర్మార్గమైన చ‌ర్య అని తెలిపారు. త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుందని భ‌రోసా ఇచ్చారు. వచ్చే సంక్రాంతికి ప్రజల ముఖాల్లో వెలుగులు నింపుతామ‌ని.. మహాశక్తి పథ‌కం కింద మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామ‌ని తెల‌పారు. అమ్మకు వందనం కింద ఎంత మంది విద్యార్దులున్నా.. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 15 వేలిస్తామ‌ని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామ‌ని.. ఆటోడ్రైవర్లు అధైర్యపడొద్దని..వారిని కూడా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామ‌ని.. యువత ప్రజల్ని చైతన్యం చేయాలన్నారు. అన్నధాత పథ‌కం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలిస్తామ‌ని తెలిపారు. ఆక్వా రైతుల్ని ఆదుకుంటాం. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు, రైతులు చితికిపోయారని.. రైతులు, కౌలు రైతులు అన్ని విధాల ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Also Read:  TDP vs YCP : ఎంపీ కేశినేని నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్‌.. ఎంపీ పదవికోసం ఇంతగా దిగజారాలా..!