ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలో వేగం పుంజుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన రాష్ట్రం, ఇప్పుడు అగ్రశ్రేణి ఐటీ సంస్థల పెట్టుబడులతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ముఖ్యంగా దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant) తమ నూతన క్యాంపస్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కాపులుప్పాడలోని ఐటీ హిల్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కాగ్నిజెంట్‌తో పాటు, టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్శన్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ & ఆర్సీఎం సర్వీసెస్, నానైల్ టెక్నాలజీస్ వంటి మరో 7 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు కూడా శంకుస్థాపన చేయడం విశాఖ ఐటీ రంగ వేగానికి నిదర్శనం.
Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం
విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 8,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టును 2029 నాటికి మొదటిదశ, 2033 నాటికి మూడు దశలు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ కంపెనీలన్నీ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రాష్ట్ర యువతకు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. భారతదేశంలో కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్న 2,41,500 మందిలో 80 శాతం మంది భారతీయులే ఉన్నారని గుర్తు చేస్తూ, ఏడాదిలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుందని పేర్కొన్నారు.
కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు పూర్తి కాకముందే, విశాఖలో ఐటీ కార్యకలాపాలను తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రుషికొండ ఐటీ పార్కు, హిల్-2పై ఉన్న మహతి ఫిన్‌టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభమైంది. వేయిమంది సీటింగ్ సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ఇది కాగ్నిజెంట్ యొక్క విశాఖపట్నం కార్యకలాపాలకు తాత్కాలిక కేంద్రంగా పనిచేస్తుంది. విశాఖ లాంటి సుందరమైన నగరం నాలెడ్జ్ ఎకానమీ మరియు టెక్నాలజీకి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే నగరానికి మెట్రో రైలు సదుపాయం వస్తుందని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన మరియు భారీ ఐటీ పెట్టుబడులతో, విశాఖపట్నం త్వరలోనే దేశంలోనే ‘మోస్ట్ హ్యాపియెస్ట్ సిటీ’గా, ప్రధాన సాంకేతిక కేంద్రంగా రూపాంతరం చెందనుంది.
