Chandrababu Naidu:`క్విట్ జ‌గ‌న్` నినాదంతో ప్ర‌జా ఉద్య‌మం!

`క్విట్ జ‌గ‌న్, సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్` నినాదంతో ప్ర‌జా ఉద్య‌మం నిర్మించ‌డానికి చంద్ర‌బాబు న‌డుం బిగించారు.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 03:57 PM IST

`క్విట్ జ‌గ‌న్, సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్` నినాదంతో ప్ర‌జా ఉద్య‌మం నిర్మించ‌డానికి చంద్ర‌బాబు న‌డుం బిగించారు. ఆ దిశ‌గా భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను ర‌చిస్తున్నారు. అందుకోసం క్యాడ‌ర్ ను దూకుడుగా ముందుకు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై ప‌దునైన విమ‌ర్శ‌లు, ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌ల చేయ‌డం ద్వారా టీడీపీ శ్రేణుల్లో క‌సిని పెంచ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రోషం ఉండాలంటూ క్యాడ‌ర్ భావోద్వేగాలను క‌ద‌లించేలా ప్ర‌సంగించారు. ప్ర‌జ‌లకు ఆలోచించే శ‌క్తి లేదంటూ త‌న‌వైపు వాళ్ల‌ను మ‌ర‌ల్చుకునే ప్లాన్ చేశారు. ఏపీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓ ప్రజా ఉద్యమం తప్పనిసరి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతేకాదు, ప్ర‌జా ఉద్యమాన్ని టీడీపీ ముందుండి నడిపిస్తుందని వెల్ల‌డించారు.

ప్ర‌జా ఉద్య‌మాల‌ను ఏపీ ప్ర‌జలు చూడ‌న‌వి కాదు. ఆనాడు ప్ర‌త్యేకాంధ్ర‌ ఉద్య‌మాన్ని చేసిన అనుభవం ఏపీ ప్ర‌జ‌ల‌కు ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను సాధించారు. ఇటీవ‌ల `స‌మైఖ్యనినాదం`ను ప్ర‌జా ఉద్య‌మంగా టీడీపీ తీసుకెళ్లింది. ఒక వైపు ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ ను గౌర‌విస్తూ స‌మైఖ్య నినాదాన్ని న‌డిపిన అనుభవం చంద్ర‌బాబుకు ఉంది. స‌మైఖ్య నినాదం ఓడిపోయిన‌ప్ప‌టికీ ఆంధ్ర ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని నామారూపాల్లేకుండా విజ‌యం సాధించారు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని 2019 ఎన్నిక‌ల ముందు ప్ర‌జా ఉద్య‌మంగా వైసీపీ న‌డిపింది. కానీ, ప్ర‌త్యేక‌హోదాను సాధించుకోలేక ఏపీ ప్ర‌జ‌లు ఓడిపోయారు. ఉద్య‌మాన్ని న‌డిపిన జ‌గ‌న్ ను సీఎం అయ్యారు. ఇదొక్క‌టే ప్ర‌జా ఉద్య‌మం ఓడిపోయిన చ‌రిత్ర ఆంధ్రాలో ఉంది. ఏడు ద‌శాబ్దాల కాలంలో చేప‌ట్టిన ప‌లు ప్ర‌జా ఉద్య‌మాలపై ఏపీ ప్ర‌జ‌లు విజ‌యం సాధించారు. కేవ‌లం ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌జా ఉద్య‌మం చేసి ఓడిపోయారు. హోదా కోసం నాయ‌క‌త్వం వ‌హించిన జ‌గ‌న్ మాత్రం గెలిచారు.

ప్రత్యేక హోదా రూపంలో చేసిన ప్ర‌జా ఉద్య‌మాన్ని ఓడించి, తాను మాత్రమే గెలిచిన జ‌గ‌న్ ను గ‌ద్దె దించ‌డానికి మ‌రో ప్ర‌జా ఉద్య‌మం చేయ‌డానికి చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఏపీ సీఎంను ఓడించి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడిన ప్ర‌జల‌ను గెలిపించ‌డానికి న‌డుంబిగించారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న క్యాడ‌ర్ కు ప్ర‌జా ఉద్య‌మం దిశ‌గా దిశానిర్దేశం చేస్తున్నారు. ఏపీ పునర్ నిర్మాణానికి కలిసి రావాలని ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు. శుక్ర‌వారం చంద్రబాబునాయుడు కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన సంద‌ర్భంగా ప్ర‌జా ఉద్య‌మం నిర్మించే దిశ‌గా ప్ర‌సంగం చేశారు. కాకినాడ పట్టణంలో నిర్వ‌హించిన‌ ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తల భేటీలో దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిన అభివృద్ధిని చెబుతూ ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రుగుతోన్న అన్యాయాలు, హ‌త్య‌లు, అత్యాచారాలు, అక్ర‌మాల‌పై చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు విసిరేస్తూ జ‌గ‌న్ స‌మాజాన్ని మోసం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. `క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్ `అంటూ చంద్ర‌బాబు నినాదం చేశారు. దేశం మొత్తం మీద పెట్రో ధరలు మండిపోతున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ నుంచి విదేశాలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పంపే పరిస్థితి నెలకొందని, రాష్ట్ర భవిష్యత్ ను జగన్ అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆవేద‌న చెందారు. ఏపీ భ‌విష్య‌త్ కోసం ప్ర‌జా ఉద్య‌మం చేప‌డ‌తాన‌ని శ‌ప‌థం చేయ‌డం క్యాడ‌ర్ ను ఉత్సాహం ప‌రిచింది. రాబోవు రోజుల్లో ఆయ‌న చెప్పిన ప్ర‌జా ఉద్య‌మం `క్విట్ జ‌గ‌న్‌` నినాదంను నిజం చేస్తుందా? అనేది చూడాలి.