నారా రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర (Nara Rama Murthy Naidu Funeral) కొనసాగుతుంది. తమ్ముడి పాడె మోస్తూ చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం అందర్నీ కలిచివేసింది. ఈ అంతిమయాత్రలో నారా , నందమూరి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుకాలం వచ్చే లోపలే అంత్యక్రియలను పూర్తి చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు.
నారా రామ్మూర్తి నాయుడి (Nara Rama Murthy Naidu) హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. శనివారం గుండెపోటు కారణంగా కన్నుమూయడంతో నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. సోదరుడి మరణ వార్త తెలిసి మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మంత్రి నారా లోకేశ్ సైతం తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. నిన్న ఆసుపత్రిలో చంద్రబాబు , నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
రామ్మూర్తినాయుడు పార్థివదేహం ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు ఆదివారం చేరుకుంది. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి పార్థివదేహాన్ని తిరుపతికి తరలించారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు తీసుకొచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్ నుంచి బయలుదేరి నారావారిపల్లెకు చేరుకోవడం జరిగింది. చంద్రబాబు తో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి, సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళి అర్పించారు.
1952లో జన్మించిన రామ్మూర్తి నాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. చంద్రబాబు కు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు.
Read Also : Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు