Naidu In Action: చంద్రబాబు ‘రివర్స్ ‘కోవర్ట్ ఆపరేషన్

తెలుగుదేశం పార్టీలో కోవ‌ర్టులు ఎక్కువ అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే ఇన్నాళ్లు కోవ‌ర్టులున్నార‌న‌ని తెలిసిన ప‌ద్ద‌తి మార్చుకుంటారని చంద్ర‌బాబు సైలెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత మాత్రం చంద్ర‌బాబు ఈ విష‌యంపై సీరియ‌స్ గా దృష్టి పెట్టారు.

  • Written By:
  • Publish Date - December 12, 2021 / 07:25 PM IST

తెలుగుదేశం పార్టీలో కోవ‌ర్టులు ఎక్కువ అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే ఇన్నాళ్లు కోవ‌ర్టులున్నార‌న‌ని తెలిసిన ప‌ద్ద‌తి మార్చుకుంటారని చంద్ర‌బాబు సైలెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత మాత్రం చంద్ర‌బాబు ఈ విష‌యంపై సీరియ‌స్ గా దృష్టి పెట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకత ఉన్నా టీడీపీ సీట్లు గెలుచుకోలేక‌పోవ‌డం కోవ‌ర్టు రాజ‌కీయ‌మేన‌ని అధిష్టానం భావించింది. ఈ కోవ‌ర్టుల‌ని పార్టీ నుంచి బ‌హిష్కరించేలా చ‌ర్య‌లను అధిష్టానం ప్రారంభించింది.అందులో భాగంగానే నెల్లూరు కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో కోవ‌ర్టులుగా ప‌ని చేసిన ఇద్ద‌రిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబు స‌మీక్ష స‌మావేశంలోనే ప్ర‌క‌టించ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలతో సుదీర్ఘంగా సమీక్షించారు. వైసిపి దౌర్జన్యాలకు భయపడి కొందరు, లాలూచీపడి మరికొందరు నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేయడంతో నెల్లూరులో పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావాల్సి వచ్చిందని చంద్ర‌బాబు అన్నారు. ఈ క్షణంనుంచే నెల్లూరులో పార్టీ ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నామన్న చంద్రబాబు…నగరంలోని అన్ని డివిజన్ కమిటీలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో పార్టీపట్ల విధేయతగా కలిగి సమర్థులైన నాయకులతో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైసిపి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన నెల్లూరు నగర ప్రజలకు చంద్రబాబునాయుడు కృతజ్జతలు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి కారకులైన వారిపై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ప్రత్యర్థులతో కుమ్మక్కయి పార్టీకి ద్రోహం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కోవర్ట్ గా పనిచేసిన గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలూరి రంగారావులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికల తెప్పించుకున్న తర్వాత మరికొందరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కుమ్మక్కు రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో ఇక సాగవని నాయ‌కుల‌కు బాబు తేల్చి చెప్పారు. కోవర్టులు ఎంతటి వారైనా స‌రే ఉపేక్షించేది లేదని తెలిపారు. పార్టీని ఏవిధంగా పటిష్టం చేయాలో తనకు తెలుసని… యువరక్తాన్ని తీసుకువస్తానని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో సిన్సియర్ గా పనిచేసిన వారికే ఇకపై పదవులు ఇస్తామ‌ని…. పార్టీకి నాయకత్వం వహించే వారు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత లేదా అని నెల్లూరు పార్టీ నేతలను ప్రశ్నించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు పార్టీకి అవసరం లేదద‌ని…. పార్టీని భ్రష్టుపట్టించారంటూ నెల్లూరు నగర నేతలపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సమీక్ష సందర్భంగా మంత్రి అనిల్ యాదవ్ తో కొందరునేతలు కుమ్మక్కయ్యారని బాబుకు కేడర్ నుంచి ఫిర్యాదుల వెల్లువెత్తాయి. క్షేత్రస్థాయిలో సిన్సియర్ గా పనిచేసేవారికే ఇకపై పార్టీ పదవులు ఇస్తామని అన్నారు. ప్రజల్లో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత ఉన్నా దాన్ని ఓట్లుగా మలచుకోవటంలో నెల్లూరు నాయకులు విఫలయ్యారని చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు వైసీపీ బెదిరింపులకు భయపడి పిరికితనంతో ప్రత్యర్థులతో లాలూచీపడ్డారని…రాజకీయాల్లో ఉన్నపుడు నిజాయితీ, ధైర్యం ఉండాలి, అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని చంద్రబాబునాయుడు అన్నారు. లాలూచీ రాజకీయాలు చేసి త‌న దగ్గర డ్రామాలాడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని నాయకులకు చంద్ర‌బాబు హితవు పలికారు. ఇకపై తన దగ్గర నాటకాలు పనిచేయవన్నారు.

ఎన్నికలు జరగుతాయని తెలిసి నగర బాధ్యులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరించారంటూ చంద్ర‌బాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. బూత్ కమిటీలు వేయక‌పోగా… కనీసం ఓటర్ లిస్ట్ కూడా పరిశీలించకపోవడం ఇంఛార్జ్ ల వైఫల్యం కాదా అని నిలదీశారు. అభ్యర్ధుల్ని చివరి నిమిషంలో ఎంపిక చేయడం కూడా పార్టీ పరాజయానికి ఓటమికి ఒక కారణంగా విశ్లేషించారు. ఎన్నికల ముందు సర్వేలో ప్రజల్లో టీడీపి పట్ల సానుకూలత ఉందని, అలాంటి అనుకూల పరిస్థితుల్లో కూడా ఒక్క సీటూ గెలవలేకపోవడం నాయకుల వైఫల్యమేనని అన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడకుండా దైర్యంగా నిలవాలని సీనియర్ నాయకులు ధైర్యం ఇవ్వలేకపోవడం దారుణమన్నారు. తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో కఠిన నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టంచేశారు. పార్టీ పట్ల విధేయత, నీతి నిజాయితీ ఉన్న సమర్ధులైన అభ్యర్ధులకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని, ప్రస్తుతం 24 డివిజన్లపై సమీక్ష పూర్తయింది, మిగిలిన డివిజన్లపై త్వరలో సమీక్షించి ప్రక్షాళన చేపడతామని చంద్రబాబునాయుడు తెలిపారు.