డా. ప్రసాదమూర్తి
టిడిపి అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో బెయిల్ మీద బయటపడ్డారు. అంతకుముందు షరతులతో కూడిన బెయిల్ ని రద్దు చేసి పూర్తి బెయిల్ ను హైకోర్టు (AP High Court) మంజూరు చేసింది. దీనితో చంద్రబాబు యధావిధిగా తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఆయన కార్యాచరణ మీద గాని, కదలికల మీద గాని ప్రసంగాలు, ప్రస్థానాల మీద గాని ఎలాంటి ఆంక్షలూ లేవు. ఇది సహజంగానే టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉండడం, ఆయన బయటపడతారో లేదో అన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో రోజురోజుకీ తీవ్రమవుతూ ఉండడంతో ఏపీ రాజకీయాల్లో కొంత గందరగోళం ఏర్పడింది.
మరోపక్క అధికారంలో ఉన్న వైసిపి నాయకత్వం చంద్రబాబును కటకటాల్లోనే కలకాలం బంధించాలని వ్యూహాలతో ముందుకు కదులుతోంది. కేసు మీద కేసు పెట్టి ఆయన్ని ఎన్నటికీ బయటకు రాకుండా చేయడానికి సకల ప్రయత్నాలూ చేస్తోంది. అంతేకాదు టిడిపిలో ముఖ్య నాయకుల్ని, లోకేష్ తో సహా అందర్నీ జైలుకు పంపిస్తామని వైసిపి నాయకులు బహిరంగంగానే తొడలు కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి పగ్గాలను ఎవరు చేపట్టాలి.. నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకోవాలి అనే మీమాంసలో పార్టీ వర్గాలు కూరుకుపోయాయి.
తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో ముందుకు తీసుకు వెళ్లే సత్తా లోకేష్ బాబుకి లేదని పార్టీ వర్గాల్లోనే కొన్ని సందేహాలు వెల్లువెత్తాయి. బాలకృష్ణకు అప్పచెబుతారా, లేక చంద్రబాబు సహచరి భువనేశ్వర్ భుజాల మీద ఆ బాధ్యతలు ఉంచుతారా, లేక లోకేష్ భార్య బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కార్యరంగంలోకి దిగుతుందా ఇలాంటి అనేకానేక ఊహాగానాలు, చర్చలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు రావడం తెలుగుదేశం పార్టీకి కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. కానీ చంద్రబాబు జైల్లోనే ఉంటే తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం కొరవడితే ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ మరింత బలపడి ప్రతిపక్షంలో కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయని చాలామంది ఆలోచన చేయడం ప్రారంభించారు.
సంక్షోభ కాలంలో స్నేహ హస్తాన్ని చాచిన పవన్ కళ్యాణ్ పట్ల కృతజ్ఞతా భావం టిడిపి వర్గాలకు ఉన్నా, తమ పార్టీలో ఏర్పడిన శూన్యాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ తనకు అనుకూలంగా మార్చుకొని ఎదిగిపోతాడో.. ఆ ఎదుగుదల తమకు అందనంత ఎత్తుగా ఎక్కడ పెరిగిపోతుందో అన్న ఆందోళన టిడిపి శ్రేణుల్లో కొంత కనపడింది. ఇలాంటి రాజకీయ గందరగోళ వాతావరణం లో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో బెయిల్ రావడం టిడిపి కార్యకర్తల నుండి నాయకుల దాకా కొత్త జవసత్వాలు పొందినంత ఉత్సాహం, ఉత్తేజం ఉరకలేయడం మొదలైంది.
చంద్రబాబు బెయిల్ ముందు.. బెయిల్ తర్వాత:
చంద్రబాబును జైలుకు పంపించి తెలుగుదేశం పార్టీని కోలుకోలేనంత దెబ్బతీయాలని, ఎన్నికలలోపు బాబు జైలు నుంచి బయటకు రాకుండా చేసి మరోసారి ప్రభుత్వాన్ని అవలీలగా ఏర్పాటు చేయాలని వైసిపి నాయకత్వం పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది. వాస్తవానికి చంద్రబాబు జైల్లోనే ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీలో శూన్యత కొనసాగేది. దాన్ని తన బలంగా పవన్ కళ్యాణ్ ఎంత మార్చుకునే వారో గానీ అధికార వైసిపి వారు మాత్రం ఆ అవకాశాన్ని ఎన్నికల్లో బాగా ఉపయోగించుకునేవారు. హైకోర్టు ఇలా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో, కన్యాశుల్కంలో గిరీశం మాటల్లో చెప్పాలంటే ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టు అయింది.
చంద్రబాబు అరెస్టుకు ముందు తెలుగుదేశం పార్టీ ఒక స్థాయి లో బలపడితే, ఆ స్థాయి అధికార వైసీపీని ఎన్నికల్లో ఓడించేంత శక్తివంతమయిందా అని తేల్చి చెప్పలేనిది. కానీ మేధావి వర్గంలో గానీ ప్రజల్లో గాని రాజకీయ వర్గాల్లో గాని చంద్రబాబును అరెస్టు చేసిన తీరు పట్ల, ఆ అరెస్టులో పోలీసులు కనబరిచిన అత్యుత్సాహం పట్ల ఒక వ్యతిరేకత మాత్రం వ్యక్తమైంది. కేసులో బలాబలాలు ఎలా ఉన్నా, నిందితుల జాబితాలో ఎక్కడో చివరి వరుసలో చంద్రబాబును ఇరికించి, అకస్మాత్తుగా ఆయన అరెస్టుకు ప్లాన్ చేసి ఆయనకు బెయిల్ రాకుండా అన్ని ప్రయత్నాలూ చేసి కేసులు మీద కేసులు పెట్టి సంపూర్ణంగా చంద్రబాబును, ఆయన పార్టీని సమాధి చేయాలని వైసిపి వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని అందరూ భావించే స్థితి అక్కడ ఏర్పడింది.
ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ రావడంతో కొత్తగా నెలకొన్న వాతావరణం తెలుగుదేశం పార్టీలో కొత్త ఊపిరి ఊదినట్టయింది. అధికార పార్టీ అహంకారంతో వ్యవహరించిందనే భావన ప్రజల్లో బలపడితే అది తెలుగుదేశానికి ఉన్న బలం రెట్టింపు కావడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పూర్తి సత్సంబంధాల్లో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు అరెస్టు తర్వాత ఏర్పడిన పరిణామాల వల్ల ప్రజల్లో ఆయన పట్ల పెరిగిన సానుభూతి పవనాలు మరింత బలపడి రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి దారి తీయవచ్చు అని విశ్లేషకుల అంచనాలు వెలువడుతున్నాయి. ఏమైనప్పటికీ చంద్రబాబు జైలుకు వెళ్లడానికి ముందున్న పరిస్థితుల కంటే, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నెలకొన్న రాజకీయ వాతావరణమే ఇప్పుడు కీలకంగా మారింది. బాబు పట్ల సానుభూతి ప్రజల్లో మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. ఇది రానున్న ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీయవచ్చునని చెప్పవచ్చు.