Chandrababu : అసెంబ్లీని బ‌హిష్క‌రించిన చంద్ర‌బాబు.. మ‌ళ్లీ సీఎంగా వ‌స్తాన‌ని శ‌ప‌థం

ఏపీ అసెంబ్లీని చంద్ర‌బాబు బ‌హిష్కరించాడు. కౌర‌వ స‌భ‌లో కొన‌సాగ‌లేన‌ని క‌న్నీటి తో ఆయ‌న నిష్క్ర‌మించాడు.

  • Written By:
  • Updated On - November 19, 2021 / 02:12 PM IST

ఏపీ అసెంబ్లీని చంద్ర‌బాబు బ‌హిష్కరించాడు. కౌర‌వ స‌భ‌లో కొన‌సాగ‌లేన‌ని క‌న్నీటి తో ఆయ‌న నిష్క్ర‌మించాడు. మ‌ళ్లీ సీఎం హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడ‌తానంటూ శ‌ప‌థం చేశాడు. ఏపీ అసెంబ్లీ ప్రారంభం నుంచే రెండో రోజు చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబం మీద వ్య‌క్తిగ‌త దూషణ‌లు అసెంబ్లీలో మొద‌ల‌య్యాయి. ఒకానొక స‌మ‌యంలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి శీలం మీద కూడా అధికార‌ప‌క్షం చ‌ర్చ‌లోకి తీసుకొచ్చింది. దీంతో మ‌న‌స్తాపానికి గురైన చంద్ర‌బాబు ఏపీ అసెంబ్లీని బ‌హిష్క‌రించాడు.

రెండో రోజు అసెంబ్లీ ప్రారంభ‌మైన వెంట‌నే ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చించాల‌ని వాయిదా తీర్మానాన్ని టీడీపీ ప్ర‌వేశ‌పెట్టింది. ఎజెండా ప్ర‌కారం వ్య‌వ‌సాయం మీద చ‌ర్చకు స్పీక‌ర్ త‌మ్మినేని అనుమ‌తి ఇచ్చాడు. వ్యవసాయంపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి కొడాలి నాని పదేపదే టీడీపీ అధినేత చంద్రబాబు పేరును ఉచ్ఛరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు… పదేపదే చంద్రబాబు పేరును ఎందుకు ఉచ్ఛరిస్తున్నారని ప్రశ్నించారు. మ‌రింత రెచ్చిపోయిన మంత్రి కొడాలి నాని.. చంద్రబాబులా లుచ్ఛా పనులు చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంచల్ గూడ్ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ అని టీడీపీ నేతలు అన్నారు. కొడాలి నాని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు… తల్లికి, చెల్లికి ద్రోహం విషయాలపై కూడా చర్చించేందుకు సిద్ధమని స‌వాల్ చేశాడు. ఆ తర్వాత ఇరు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది.

Also Read : వైజాగ్‌కు మరో గండం

ఆ తర్వాత మొత్తం చర్చ వ్యక్తిగత విషయాలపైకి వెళ్లింది. ‘గంటా… అరగంటా’ అంటూ టీడీపీ నేతలు గోల చేశారు. మాధవరెడ్డిని చంపింది ఎవరు? వంగవీటి రంగాను హత్య చేసింది ఎవరు? ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు టీడీపీనే అధికారంలో ఉందని వైసీపీ సభ్యులు అన్నారు. ఈ గందరగోళం మధ్య చంద్రబాబు కీలక ప్రకటన చేశాడు. ఈ అవమానాలు భరించలేనని… ఈ సభలో పడరాని అవమానాలు పడుతున్నానని… మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని చెపుతూ సభ నుంచి వెళ్లిపోయాడు.