Site icon HashtagU Telugu

తిరుమ‌ల జంబో బోర్డుపై దుమారం..నేర‌స్తులు, రాజ‌కీయ నిరుద్యోగుల అడ్డా

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మారింది. పూర్తి స్థాయి వాణిజ్య కేంద్రంగా మార్చేస్తున్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌కు విరుద్ధంగా ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌ను తీసుకుంటోంది. దేవ‌స్థానం చరిత్ర‌లో లేని విధంగా 81 మందితో కూడా జంబో బోర్డును నియ‌మించ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. అందుకే, త‌క్ష‌ణం బోర్డును ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు బ‌హిరంగ లేఖ రాశాడు. క్రిమిన‌ల్ కేసులు ఉన్న వాళ్లు, సీబీఐ కేసుల విచార‌ణ‌లో ఉన్న వాళ్ల‌ను బోర్డులో స‌భ్యులుగా వేయ‌డం భ‌క్తుల్ని బాధిస్తోంద‌ని లేఖ‌లో పొందుప‌రిచారు. ప్ర‌పంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమ‌ల తిరుప‌తి ప్రాముఖ్య‌త‌ను కాపాడాల‌ని చంద్ర‌బాబు కోరారు. రెండోసారి వైవీ సుబ్బారెడ్డిని చైర్మ‌న్ గా నియ‌మించ‌డాన్ని కూడా బాబు త‌ప్పుబ‌ట్టారు. రాజ‌కీయాల‌కు వాడుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు.
తిరుమ‌ల తిరుప‌తి బోర్డు నియామ‌కానికి కొన్ని ప‌ద్ధ‌తులు పాటించాలి. హిందూ సంప్ర‌దాయాల‌ను గౌర‌వించే వాళ్లు, శ్రీవారి ప్రాశ‌స్త్యం, ప్రాముఖ్య‌త‌, తిరుమ‌ల కొండ ప్రాధాన్యం తెలిసిన వ్యక్తుల‌కు బోర్డులో అవ‌కాశం క‌ల్పించాలి. నేర ఆరోప‌ణ‌లు ఉన్న వాళ్ల‌ను నియ‌మించ కూడ‌దు. కానీ, అందుకు విరుద్ధంగా నియ‌మించిన వాళ్ల‌లో కొన్ని పేర్ల‌ను చంద్ర‌బాబు లేఖ‌లో పొందుప‌రిచారు. వాళ్ల‌లో బీజేపీ క‌ర్నాట‌క ఎమ్మెల్యే విశ్వ‌నాథ్ రెడ్డి, డీఎంకే ఎమ్మెల్యే నంద‌కుమార్, శివ‌సేన‌కు చెందిన మిలింద్ నర్విక‌ర్, పుదుచ్చేరి మాజీ మంత్రి మ‌ల్లాడి క్రిష్ణారావు, మై హోం రాజేశ్వ‌ర‌రావు, ఇండియా సిమెంట్ డైరెక్ట‌ర్ శ్రీనివాసన్ త‌దిత‌రుల పేర్ల‌ను తెలియ‌ప‌రిచారు.
ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఏర్పడిన తొలి బోర్డు నియామ‌కాల్ని టీడీపీతో పాటు భ‌క్తులు త‌ప్పుబ‌ట్టారు. అప్ప‌ట్లోనే జంబో బోర్డు ను ఏర్పాటు చేశార‌ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. వాటిని ప‌ట్టించుకోని జ‌గ‌న్ ఈసారి ఏకంగ 81 మందిని నియ‌మించారు. సాధార‌ణంగా ఇలాంటి నియామ‌కాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే, సెంటిమెంట్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. పైగా జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌పై హిందువుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి.
ఇలాంటి స‌మ‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన జ‌గ‌న్ , అందుకు విరుద్ధంగా నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నారు. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని త‌ర‌చూ ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వీటికి చెక్ పెట్ట‌డానికి జ‌గ‌న్ ప్ర‌య‌త్నించాలి. కానీ, హిందువుల‌ను రెచ్చ‌గొట్టేలా జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అప‌వాదు ఉంది. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ పున‌రాలోచ‌న చేసి జంబో బోర్డును ర‌ద్దు చేయాల‌ని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు కూడా అలాంటి డిమాండ్ ను లేఖ రూపంలో జ‌గ‌న్ కు రాసారు. సో..జ‌గ‌న్ ఆలోచిస్తారా? ఆ లేఖ‌ను బుట్ట‌దాఖ‌లు చేస్తారా? అంటే రెండోదే జ‌రుగుతుంద‌ని చాలా మంది భావిస్తున్నారు.

Exit mobile version