ఏపీలో స్థానిక ఫ‌లితాల ట‌మారం.. అసెంబ్లీ ర‌ద్దు?..చంద్ర‌బాబు రాజీనామా?

స్థానిక ఫ‌లితాల ఆధారంగా పార్టీల బ‌లాబ‌లాల‌ను నిర్థారించ‌లేం. సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, స్థానిక ఫ‌లితాల‌కు పొంత‌న ఉండ‌దు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల‌మైన ఫ‌లితాలు రావ‌డం అత్యంత స‌హ‌జం. అందుకు సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌లు అనేకం ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 23, 2021 / 02:19 PM IST

స్థానిక ఫ‌లితాల ఆధారంగా పార్టీల బ‌లాబ‌లాల‌ను నిర్థారించ‌లేం. సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, స్థానిక ఫ‌లితాల‌కు పొంత‌న ఉండ‌దు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల‌మైన ఫ‌లితాలు రావ‌డం అత్యంత స‌హ‌జం. అందుకు సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌లు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బ‌లంగా ఉన్నామ‌ని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు, ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఏక‌ప‌క్షంగా గెలుచుకుంది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని జ‌డ్పీటీసీ స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది. మొత్తం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాల్లో 62 చోట్ల ఫ్యాన్ గాలి వీచింది. కుప్పం మండ‌లంలోని 19 ఎంపీటీసీ స్థానాల్లో 17 వైసీపీ గెలిచింది. ఇక అచ్చెంనాయుడు నియోజ‌క‌వ‌ర్గం టెక్క‌లిలోని 72 జ‌డ్పీటీసీల‌ను జ‌గ‌న్ పార్టీ మొత్తంగా కైవ‌సం చేసుకుంది. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని 78 ఎంపీటీసీల‌కుగాను 72 చోట్ల ఫ్యాన్ గాలి వీచింది.

కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ హ‌వా కొన‌సాగింది. అన్ని15 కార్పొరేష‌న్ల‌లో ఫ్యాన్ స్పీడ్ గా తిరిగింది. ఇక మున్సిపాలిటీల్లోని 75 గాను 74 చోట్ల జ‌గ‌న్ పార్టీ గెలుచుకుంది. ఆ త‌రువాత జ‌రిగిన జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో 95శాతం వైసీపీ గెలుచుకుంది. ఈ ఫ‌లితాల‌ను గ‌మనిస్తే, జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని ఆ పార్టీ భావిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో 50శాతానికి పైగా ఓట్ల‌ను సాధించిన వైసీపీ 151 చోట్ల ఎమ్మెల్యేల‌ను గెలుచుకుంది. 25 లోక్ స్థానానాల‌కు గాను 22 చోట్ల విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసి తిరుగులేని శ‌క్తిగా జ‌గ‌న్ నిల‌బడ్డారు. ప్ర‌జ‌లు అత్యంత భారీ ఆశ‌ల‌తో జ‌గ‌న్ ను సీఎం చేశారు.

మేనిఫెస్టోలోని 95శాతం హామీల‌ను అమ‌లు చేశామ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తోంది. అందుకే, రెండున్న‌రేళ్ల త‌రువాత జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో్ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల కంటే మెరుగైన ఫ‌లితాల‌ను సాధించామ‌ని ఆ పార్టీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల చెబుతున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన త‌రువాత వ‌చ్చిన ఫ‌లితాలుగా వైసీపీ భావించంలేదు.
వాస్త‌వంగా జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్క‌రించింది. నామినేష‌న్ల ఘ‌ట్టం వ‌ర‌కు పోరాడిన ఆ పార్టీ అధికార పార్టీ దూకుడును త‌ట్టుకోలేక‌పోయింది. అందుకే, మ‌ధ్య‌లోనే ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆగ‌స్ట్ 8న జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ హైకోర్టు తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు ఆగి సెప్టెంబ‌ర్ 16న కౌంటింగ్ చేశారు. ఫలితాలు ఏక‌ప‌క్షంగా రావ‌డం వైసీపీ వ‌ర్గాల్లో నూత‌నోత్సాహం కనిపిస్తోంది.

స్థానిక ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌ను చూసి సంబ‌ర‌ప‌డుతోన్న వైసీపీకి ప్ర‌తిప‌క్షం టీడీపీ వినూత్న‌మైన స‌వాల్ విసిరింది. ఈ ఫలితాల‌పై న‌మ్మ‌కం ఉంటే అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని స‌వాల్ చేసింది. కుప్పంలో చంద్ర‌బాబునాయుడ్ని రాజీనామా చేసి గెలిపించుకోవాల‌ని ప్ర‌తిగా వైసీపీ స‌వాల్ విసిరింది. మొత్తం మీద స్థానిక ఫ‌లితాలు ఏపీలో రాజ‌కీయ స‌వాళ్ల‌కు ఊత‌మిస్తున్నాయి. కానీ, గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు, స్థానిక ఫ‌లితాల చ‌రిత్ర‌ను అవ‌లోకిస్తే…ఏ మాత్రం పొంత‌న ఉండ‌దు. సో…స్థానిక ఫలితాల‌ను సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పోల్చ‌డం టైం పాస్ వ్య‌వ‌హారం కింద ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.