Site icon HashtagU Telugu

Chandrababu : ఏపీ సంప‌ద రూ. 3ల‌క్ష‌ల కోట్లు ఆవిరి: చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Babu Notes

Babu Notes

ఏపీ సంప‌ద రూ.3ల‌క్ష‌ల కోట్లు ఆవిరైపోయింద‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్ర‌క‌టించిన స‌మ‌యంలో ఎక‌రం రూ. 10కోట్లకు విక్ర‌యించిన విష‌యాన్ని గుర్తు చేశారు. అదే, ఇప్పుడు అయితే రూ. 30కోట్ల వ‌ర‌కు ఎక‌రం ప‌లికేద‌ని చంద్ర‌బాబు లెక్కించారు. ఆ లెక్క‌న ఇప్పుడు మిగిలి ఉన్న 10వేల ఎక‌రాల‌ను అమ్ముకుంటే రాష్ట్రానికి రూ. 3లక్ష‌ల కోట్ల సంప‌ద క్లియేట్ అయ్యేద‌ని టీడీపీ లీగ‌ల్ సెల్ స‌మావేశంలో కోల్పోయిన విజ‌న్ ను ఆవిష్క‌రించారు.

ఏపీకి అమ‌రావ‌తి, పోల‌వ‌రం రెండు క‌ళ్లుగా ఉండేవ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఆ రెండు క‌ళ్ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పొడిచేశార‌ని ఆరో్పించారు. త‌న హ‌యాంలో 72 శాతం పూర్తయిన పోలవరంను ముంచేశారు. ఉపాధి కల్పన కోసం, సంపదను సృష్టించడం కోసం అమరావతిని తీర్చిదిద్దాలనుకున్నామ‌ని వివ‌రించారు. ఒకప్పుడు హైదరాబాదులో ఎకరా భూమి రూ.50 వేలు, రూ.1 లక్ష ఉంటే, ఇప్పుడది రూ.50 కోట్లు, రూ.60 కోట్లకు చేరింది. సంపద సృష్టించే మార్గంలోనే అలా సాధ్య‌మైయింద‌ని స్వానుభ‌వాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టిస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల‌ని అడ్వ‌కేట్ల‌కు పిలుపు ఇచ్చారు. అక్ర‌మ అరెస్ట్ ల మీద ప్రైవేటు కేసుల‌ను వేసి ఉచితంగా టీడీపీ క్యాడ‌ర్ కు సేవ‌ల‌ను అందించాల‌ని సూచించారు. విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇవ్వాల‌ని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వకేట్లు టీంగా ఏర్పడి స్థానికంగా న‌మోదైన కేసులపై గైడ్ చెయ్యాల‌ని దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత అడ్వకేట్లకు మంచి అవకాశాలు కల్పిస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

పోలీస్ వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించిందని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీస్ శాఖను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉప‌యోగించుకుంటున్నార‌ని బాబు విమర్శించారు. వివేకా హత్య కేసు తర్వాత ఇద్దరు చనిపోయారని, అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నాడని అన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు వేధించారని వివరించారు. రఘురామ పట్ల పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తించారని, రఘురామ ఇప్పుడు ఏపీకి రాలేని పరిస్థితి కల్పించారని పేర్కొన్నారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏంటి? అని చంద్రబాబు ఆవేదన చెందారు.

ఇక, టీడీపీ నేతల పట్ల పోలీసులు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేత దారపనేని నరేంద్ర అరెస్ట్ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. “నేడు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది… పోలీసులు ఎవరైతే కొట్టారో వారి పేర్లు కూడా ఉన్నాయి. ఎవరో లక్ష్మణరావు అంట… సీఐ! మరో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. అందరి చరిత్రలు రాస్తున్నా. తప్పుచేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేదిలేదు. ఏమనుకుంటున్నారు మీరు? చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు కూడా శిక్ష తప్పదు. చట్టాన్ని అతిక్రమిస్తే వారి గుండెల్లో నిద్రపోతా. ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు గడిచాయి.. ఈ ఉన్మాదులతో మరో సంవత్సరం గడవాలి` ` అంటూ అడ్వ‌కేట్ల స‌మావేశంలో బాబు గ‌ర్జించారు.

మూడు రాజధానులు అంటూ సమాజంలో ప్రాంతీయ విద్వేషాలు కలిగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. “నీకు విశాఖపై ప్రేమ ఉంటే ఏంచేశావు? హెచ్ఎస్ బీసీ సంస్థ విశాఖ నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది. లులూ గ్రూప్ వెళ్లిపోయింది, ఫార్చ్యూన్-500 కంపెనీల్లో కొన్ని వస్తే అవి కూడా వెళ్లిపోయాయి. ఈ రాష్ట్రానికే మేం రాం అంటూ ఇంకొందరు వెళ్లిపోయారు` అంటూ చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. విశాఖలో రుషికొండ పరిస్థితిపై హైకోర్టు ఏమని వ్యాఖ్యానించిందో అందరం చూశామ‌ని గుర్తు చేశారు. అప్పట్లో విదేశీయులు విశాఖ వస్తే, ఆ రుషికొండను చూసి తాము వచ్చింది విశాఖకేనని నిర్ధారించుకునేవారని అన్నారు. అలాంటి రుషికొండను నేడు బోడిగుండు చేసేశారని ఆరోపించారు. కొండ అనేదే లేకుండా చేశారు. పర్యావరణానికి హాని కలిగించేవారిపై న్యాయవ్యవస్థలు ఉక్కుపాదం మోపిన ఘటనలు ఉన్నాయ‌ని గుర్తు చేస్తూ అడ్వ‌కేట్లు యాక్టివ్ గా ఉండాల‌ని పిలుపునిచ్చారు.