AP and 11 lakh cr debt: ఏపీ `ఐర‌న్ లెగ్‌` జ‌గ‌న్: బాబు

ఏపీలో రాజ‌కీయ‌ప‌ర‌మైన సెంటిమెంట్ రాజుకుంటోంది. ఒక‌ప్పుడు చంద్ర‌బాబునాయుడు అధికారంలో ఉంటే వ‌ర్షాలు ప‌డ‌వంటూ వైసీపీ ప్ర‌చారం చేసింది.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 05:30 PM IST

ఏపీలో రాజ‌కీయ‌ప‌ర‌మైన సెంటిమెంట్ రాజుకుంటోంది. ఒక‌ప్పుడు చంద్ర‌బాబునాయుడు అధికారంలో ఉంటే వ‌ర్షాలు ప‌డ‌వంటూ వైసీపీ ప్ర‌చారం చేసింది. ఇప్పుడు అలాటి సెంటిమెంట్‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `ఓ ఐర‌న్ లెగ్‌` అంటూ చంద్ర‌బాబునాయుడు స్లోగ‌న్ అందుకున్నారు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రం దివాళ తీసింద‌ని సెంటిమెంట్ ను ర‌గిల్చారు. వెనుక‌బ‌డిన రాష్ట్రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏపీకి ముద్ర‌వేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `ఐర‌న్ లెగ్` ఇంకా కొన‌సాగితే, రాష్ట్రానికి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు.

జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దఎత్తున అప్పులు తెస్తున్నందున 2024 నాటికి రాష్ట్రం రూ.11 లక్షల కోట్ల అప్పు చేస్తార‌ని చంద్ర‌బాబు అంచ‌నా వేశారు. కేవలం మూడేళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిన జ‌గ‌న్ వచ్చే రెండేళ్లలో మరో 3 లక్షల కోట్ల అప్పులు చేయడం ఖాయమ‌ని చెప్పారు. ‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అపారంగా విధ్వంసం చేసి సైకోగా నిరూపించుకున్నాడ‌ని ఆరోపించారు. “జగన్ వచ్చాక రాష్ట్రం దివాలా తీసింది. జగన్ ఓ ఐర్ లెగ్. కోడికత్తి వంటి డ్రామాలు మనం చేయలేదు. ఆ అవసరం కూడా మ‌న‌కు లేదు. జగన్ ఊరికొక సైకోను తయారు చేశారు. ఇలాంటి పొలిటికల్ సైకోలను అణచివేసే బాధ్యత మనకుంది. ఆ శక్తి కూడా మనకుంది.“ అంటూ టీడీపీ క్యాడ‌ర్ ను ఉత్సాహ‌ప‌రిచేలా బాబు దిశానిర్దేశం చేశారు. సైకోలాంటి సీఎంను వెంట‌నే దించేయ‌క‌పోతే ప్ర‌జ‌ల‌కు ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు.
విశాఖ‌ జిల్లా ప‌ర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం నేతలు, కార్యకర్తల పనితీరు, సేవల ఆధారంగానే భవిష్యత్తులో వారికి అవకాశాలు ఇస్తామని తెలిపారు. పార్టీ కోసం ఆర్థికంగా సాయపడేవాళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వారికి మెరుగైన అవకాశాలు ఉంటాయని వెల్ల‌డించారు. ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత టీడీపీ క్యాడ‌ర్ , లీడ‌ర్ల‌పై ప‌లు కేసుల‌ను న‌మోదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ మాన‌సిక ధైర్యాన్ని దెబ్బ‌తీసేలా గేమ్ ఆడుతోంది. ఆ విష‌యాన్ని గుర్తించిన చంద్ర‌బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దని క్యాడ‌ర్ కు ధైర్యాన్ని నూరిపోశారు. ఎన్ని ఎక్కువగా కేసులు ఉంటే అంత రాజ‌కీయ భవిష్యత్తు ఉంటుంద‌ని అన్నారు. ఈ కేసుల కోసం ఓ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, అన్నింటినీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటాన‌ని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పనిచేసేవాళ్లకు, ప్రజలతో నిత్యం మమేకయ్యే వారికే పదవులు ఉంటాయని బాబు స్పష్టం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీలో ప్రజలకు అత్యధిక భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోరాడాలని, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ గెలుపు ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ‌త కొంత కాలంగా పార్టీ దూరంగా ఉంటోన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు కూడా ఈ స‌మావేశంలో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. మూడేళ్లుగా ఆయ‌న టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఒకానొక సంద‌ర్భంలో పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ‌ను కూడా చంద్ర‌బాబుకు పంపించారు. కానీ, ఆ రాజీనామాను పార్టీ ఆమోదించ‌లేదు. ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధినేత బాబుకు లెట‌ర్ రాశారు. కానీ, ఆక‌స్మాత్తుగా చంద్ర‌బాబు విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో గంటా శ్రీనివాస‌రావు క‌నిపించ‌డం టీడీపీ శ్రేణుల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

ఇటీవ‌ల ఇండియా టుడే చేసిన మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలోనూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంకేతం ఉంది. అధికారంలోకి తిరిగి టీడీపీ వ‌స్తుంద‌ని క్యాడ‌ర్ ఉత్సాహంగా ఉంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని లీడ‌ర్లు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఆ క్ర‌మంలో గంటా శ్రీనివాస‌రావు కూడా మ‌న‌సు మార్చుకున్నాడ‌ని విశాఖ జిల్లాకు చెందిన ఒక టీడీపీ. లీడ‌ర్ `హాష్ ట్యాగ్ యూ`కు చెప్పారు. జ‌గ‌న్ ఐర‌న్ కార‌ణంగా ఆయ‌న సీఎం అయిన త‌రువాత ఎన్నో ఉత్పాతాలు ఏపీలో జ‌రిగాయ‌ని గుర్తు చేశారు. విశాఖలో ఎల్జీ పాలిమ‌ర్స్, విజ‌య‌వాడ భ‌వానీ ఐలాండ్ ప‌డ‌వ ప్ర‌మాదం, విజ‌య‌వాడ గో శాల‌లోని ఆవుల మ‌ర‌ణం, ద్వారాకా తిరుమ‌ల ర‌థం కాలిపోవ‌డం, రామ‌తీర్థం రాములోరి త‌ల న‌ర‌క‌డం, టీటీడీ నిధుల‌ను మ‌ళ్లించ‌డం, క‌ల్తీ సారా, త‌దిత‌ర ఉత్పాతాల గురించి చెప్పారు. వీటితో పాటు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల కార‌ణంగా ఎంతో మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మ‌హిళ‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చోటుచేసుకుంటున్నాయి. వీటిన్నంటినీ చూసిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `ఐర‌న్ లెగ్‌` మ‌హిమ గురించి ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నార‌ని వివ‌రించారు. అదే విష‌యాన్ని చంద్ర‌బాబు విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌జ‌ల‌కు తెలియ‌చెప్పార‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని టీడీపీ కీల‌క లీడ‌ర్ అన్నారు.