Chandrababu Naidu: తప్పుడు చట్టంతో జీవో ఇచ్చారని చంద్రబాబు ఫైర్.. పోలీసుల తోపులాట!

ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. అందులోనూ ముఖ్యంగా కుప్పం రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - January 5, 2023 / 11:04 AM IST

Chandrababu Naidu:ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. అందులోనూ ముఖ్యంగా కుప్పం రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. కుప్పంలో తన సొంత నియోజకవర్గం అని, అక్కడ 7 సార్లు ఎమ్మెల్యేగా తాను గెలిచానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత నెలలోనే తాను కుప్పం పర్యటనకు వస్తానని డీజీపీకి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ ఈ నెల 2వ తేదీన వైసీపీ సర్కార్ కొత్త జీవో తెచ్చిందన్నారు. కుప్పంలో రోడ్డు షోలు పెట్టకూడదని నిబంధనలు తీసుకురావడం ఏంటని ఆయన ఫైర్ అయ్యారు.

కుప్పంలో తన రోడ్ ‌షోను అడ్డుకునేందుకు వైసీపీ సర్కార్ కొత్త జీవో తేవడం సిగ్గుచేటని అన్నారు. సీఎం జగన్ దయాదాక్షిణ్యాలతో సభలు పెట్టుకునేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని విమర్శలు గుప్పించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కుప్పం నియోజకవర్గానికి బయల్దేరి రాగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటని ఫైర్ అయ్యారు.

పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తన వాహనం నుంచి కిందకుదిగగా చంద్రబాబుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేసి తమ నిరసనను తెలిపారు. జీవో ఇచ్చిన మరుసటి రోజే సీఎం జగన్ సభను నిర్వహించారని, ఆ రోజు స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చారని, వైసీపీ సభకు రాని వారికి పెన్షన్లు కట్ చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీని చూసి జగన్ కు వణుకు పుట్టిందని, అందుకే ఇలా తమ సభలను అడ్డుకుంటున్నారని అన్నారు. తన కంటే బ్రిటీష్ వాళ్లే నయం అని, బిట్రీష్ వాళ్లు కూడా గాంధీజీని ఉద్యమాలు చేయనిచ్చారని గుర్తు చేశారు. తన ప్రచార రథం తెచ్చే వరకు అదే గ్రామంలో తాను పాదయాత్రగా వెళ్తానని, ఆ తర్వాత మైక్ రాకుంటే అక్కడే ధర్నా చేస్తానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.