Press Release : మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..

Chandrababu Diwali Gift : తాము అధికారంలోకి వస్తే దీపం పథకం కింద ప్రతి మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు

Published By: HashtagU Telugu Desk
Cbn Diwali

Cbn Diwali

అమరావతి:- రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) దీపావళి కానుక (Diwali Gift) ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్ ల వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం…ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల (Super Six Schemes) అమలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందించనుంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా (Three cylinders free per year) ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే దీపం పథకం కింద ప్రతి మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా దీపం పథకాన్ని దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని….దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్,ఆ శాఖ అధికారులు, చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో సియం సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సమీక్ష జరిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నా….పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 31 తేదీన దీపావళి పథకం ప్రారంభించాలని సిఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుతుందని సిఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింప చేయాలని అన్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఈనెల 31వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్దం చేయాలని సిఎం ఆదేశించారు.

మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని….ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని సిఎం అన్నారు. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని సిఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయని సిఎం అన్నారు. అందుకే ఆర్థిక కష్టాలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని సిఎం అన్నారు.

అర్హత గల ఏ ఒక్క లబ్దిదారునికి ఈ పథకం రాలేదనే విమర్శ రాకుండా కట్టుదిట్టంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తొలుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పవర్ పాంయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851లుగా ఉందని వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల భారం పడుతుందని, అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల భారం పడుతుందని తెలిపారు.

Read Also : India-China : సరిహద్దు వివాదంలో భారత్‌, చైనా మధ్య కీలక ఒప్పందం

  Last Updated: 21 Oct 2024, 07:15 PM IST