Site icon HashtagU Telugu

Chandrababu: ఆ ‘కడుపు కోతకు’ ఏం సమాధానం చెబుతారు?

Charandrababu

Charandrababu

ఇటీవల కొత్తగా కొలువుదీరిన ఏపీ కేబినెట్ వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రమాణస్వీకారం చేసి రోజులు గడువక ముందే సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మంత్రుల ఊరేగింపు కార్యక్రమాల్లో కార్యకర్తలు అత్సుత్సాహం ప్రదర్శించడం, ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించడం పలు సమస్యలకు దారితీస్తోంది. తాజాగా అస్వస్థతకు గురైన 8 నెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మంత్రి ఊరేగింపు కారణంగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఆ చిన్నారి కన్నుమూసింది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో జరిగిందీ ఘటన. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేశ్-ఈరక్క దంపతులకు 8 నెలల క్రితం పాప జన్మించింది. చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ పట్టణానికి వస్తుండడంతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో చిన్నారి కన్నుమూసింది.

ఈ ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియాక్ట్ అయ్యారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తనను తీవ్రంగా కలచివేసిందిని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాలకోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణమయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణమని మంత్రి తీరును ఎండగట్టారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని అడ్డుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారు? అని ఆయన ప్రశ్నించారు. చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి… ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు అని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.