AP Politics : ఎన్డీయేతో భాగ‌స్వామ్యం చంద్ర‌బాబు మ‌రో త‌ప్పేనా?

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణంలో చేసిన రాజ‌కీయ పొర‌బాట్లు చాలా ఉన్నాయి. విజ‌న‌రీగా ఉమ్మ‌డి, న‌వ్యాంధ్ర అభివృద్ధికి బాట‌లు వేయ‌డం వేరు. రాజ‌కీయంగా పార్టీని బ‌లంగా ఉంచుకోవ‌డం స‌ప‌రేటు. ఆ విష‌యంలో చంద్ర‌బాబు చేసిన త‌ప్పులు పార్టీని వెంటాడుతున్నాయి

  • Written By:
  • Updated On - August 29, 2022 / 03:58 PM IST

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణంలో చేసిన రాజ‌కీయ పొర‌బాట్లు చాలా ఉన్నాయి. విజ‌న‌రీగా ఉమ్మ‌డి, న‌వ్యాంధ్ర అభివృద్ధికి బాట‌లు వేయ‌డం వేరు. రాజ‌కీయంగా పార్టీని బ‌లంగా ఉంచుకోవ‌డం స‌ప‌రేటు. ఆ విష‌యంలో చంద్ర‌బాబు చేసిన త‌ప్పులు పార్టీని వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఎన్డీయేలో భాగ‌స్వామిగా వెళితే మ‌రో త‌ప్పు చేసిన నాయ‌కునిగా చంద్ర‌బాబు మిగులుతార‌ని ఆ పార్టీలోని కొంద‌రు బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు.

నేష‌న‌ల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ను న‌డిపించిన ఎన్టీఆర్ హ‌యాం నుంచి చంద్ర‌బాబు రోల్ ఉంది. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న వ్యూహాలు ఫ‌లించ‌లేదు. కొన్ని సంఘ‌ట‌న‌ల్లో మాత్రం ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌త ప‌నిచేసింది. ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుడ్ని చేసిన త‌రువాత జ‌రిగిన 1999 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు క‌లిసొచ్చింది. ఆనాడు వాజ్ పేయ్ హ‌వా ప‌నిచేసింది. ఆ త‌రువాత అదే పార్టీతో 2004లో పొత్తు పెట్టుకుని బోల్తా ప‌డ్డారు. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ హ‌వా 2014 ఎన్నిక‌ల్లో ఉన్న టైమ్ లో బీజేపీతో పొత్తు చంద్ర‌బాబుకు క‌లిసొచ్చింది. విడిపోయిన ఏపీకి సీఎం అయ్యారు. కానీ, ఇప్పుడు మోడీ వ్య‌తిరేక గాలితో పాటు ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది.

వాస్త‌వంగా ఏపీలోని ప్ర‌జ‌లు మోడీ స‌ర్కార్ మీద ఆగ్ర‌హంగా ఉన్నారు. ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌కుండా దాట‌వేయ‌డంతో పాటు విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా ముద్ర ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభ‌జించ‌డానికి బిల్లు పెట్టిన కాంగ్రెస్ ను నామ‌రూపాల్లేకుండా అక్క‌డ ప్ర‌జ‌లు చేశారు. ఆ బిల్లును ఆమోదించ‌డానికి సూత్ర‌ధారిగా ఉన్న బీజేపీని కూడా దొరికిన‌ప్పుడు నేల‌కేసి కొట్టాల‌న్న కోపం ఏపీ ఓట‌ర్ల‌లో ఉంది. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీనియార్టీ చూసి ఓటేసిన ఏపీ ప్ర‌జ‌లు ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌ను మ‌రిచిపోలేదు. ప్ర‌త్యేకహోదా, ప్యాకేజీ మీద బీజేపీ, టీడీపీ ఆడిన ధ‌ర్మ‌, అధ‌ర్మ యుద్ధాలు క‌ళ్ల‌లో మెదులుతూనే ఉంటాయి. ఫ‌లితంగా ఏపీ ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకునే క‌మ‌లం పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి వ‌చ్చే లాభం ఏమిటో ఆ పార్టీలోనే అంత‌ర్గ‌తంగా సీరియ‌స్ చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎన్డీయేలో భాగ‌స్వామిగా మారిన వెంట‌నే టీడీపీ మైనార్టీ ఓటును భారీగా కోల్పోయే ప్ర‌మాదం ఉంది. 2019 ఎన్నిక‌ల్లో స‌డ‌లిపోయిన బీసీ ఓటు బ్యాంకు కొంత తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ, ఓవ‌రాల్ గా మోడీ ప్ర‌భుత్వం మీద ఉన్న యాంటీ, టీడీపీ మీద ప‌డ‌కుండా ఉండ‌దు. జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ క‌లిసి వెళ్లి ప్ర‌జ‌ల‌కు ఏమి చెబుతారు? అనేది కూడా పెద్ద ప్ర‌శ్న‌. ఒక వైపు యూపీయే ప్ర‌త్యేక హోదాను ఇస్తాన‌ని చెబుతోంది. ఇంకో వైపు బీజేపీ ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెబుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్డీయేలో భాగ‌స్వామి అయిన త‌రువాత చంద్ర‌బాబు ఏమి చేస్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని రాష్ట్రం నుంచి కేంద్ర నిఘా వ‌ర్గాల వ‌ర‌కు అంచ‌నా వేస్తున్నాయ‌ని తెలుస్తోంది. అంతేకాదు, ప్రైవేటుగా జగన్ మోహన్ రెడ్డి చేయించుకున్న స‌ర్వేల్లోనూ మ‌ళ్లీ ప్ర‌భుత్వ ఏర్పాటు ఈజీకాద‌ని తేలింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని అంత‌ర్గ‌త చ‌ర్చ. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోని మైనార్టీ ఓట‌ర్లు మూకుమ్మ‌డిగా జ‌గ‌న్ వైపు మ‌ళ్లే ప్ర‌మాదం ఉంది. పైగా ఓవైసీ ప్ర‌భావం కూడా ఏపీ ఎన్నిక‌ల్లో ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో దారినిపోయే బీజేపీ దుమారాన్ని చంద్ర‌బాబు 2024 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై వేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని ఆ పార్టీలోని సీనియ‌ర్ల వాద‌న‌.

ఎన్డీయే భాగ‌స్వామిగా ఉన్న పార్టీలు ప్ర‌స్తుతం హ్యాపీగా లేవు. ప్ర‌భుత్వాల‌ను ప‌డేస్తూ వ‌స్తోన్న మోడీ, షా ద్వ‌యం ఒక వేళ చంద్ర‌బాబుకు అధికారం వ‌చ్చిన‌ప్ప‌టికీ పాల‌న స‌వ్యంగా సాగ‌నిస్తార‌న్న న‌మ్మకం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్డీయేతో టీడీపీ భాగ‌స్వామ్యం జ‌గ‌న్ నెత్తిన పాలుపోసిన‌ట్టే అవుతుంద‌ని సీరియ‌స్ చ‌ర్చ ప్ర‌జ‌ల్లో జ‌రుగుతోంది. మ‌రి, చంద్ర‌బాబు నాయుడు సుదీర్ఘ కాలం పాటు చేసిన త‌ప్పుల్లో 2024 ఎన్నిక‌ల్లో ఎన్డీయేతో వెళ్ల‌డం మ‌రో త‌ప్పు కిందకు వెళుతుందా? లేదా? ఆయ‌న తీసుకోబోతున్న‌ నిర్ణ‌యం పార్టీకి మేలు చేస్తుందా? లేదా? అనేది చూడాలి.