Chandrababu Master Plan : చంద్ర‌బాబు తెరచాటు చ‌తుర‌త

మాజీ సీఎం చంద్ర‌బాబు వ‌ల‌న `చలో విజ‌య‌వాడ ` సూప‌ర్ హిట్ కాలేదు.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 02:13 PM IST

మాజీ సీఎం చంద్ర‌బాబు వ‌ల‌న `చలో విజ‌య‌వాడ ` సూప‌ర్ హిట్ కాలేదు. ఈ విజ‌యాన్ని ఆయ‌న ఖాతాలో వేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మంత్రి క‌న్న బాబు ఆరోపిస్తున్నాడు. అంటే..ఉద్యోగులు చేసిన `చ‌లో విజ‌య‌వాడ‌` వెనుక చంద్ర‌బాబు లేడ‌ని చెప్ప‌డానికి వైసీపీ నానా తంటాలు ప‌డుతోంది. ఆ క్రెడిట్ చంద్ర‌బాబుకు రాకుండా ఉండాల‌ని మంత్రులు రంగంలోకి దిగారు. వాస్త‌వంగా రాజ‌కీయ ప్ర‌మేయ‌లేకుండా ఉద్యోగులు ఉద్య‌మిస్తున్నామ‌ని చెప్పారు. పైగా ఏ రాజ‌కీయ పార్టీ కూడా మ‌ద్ధ‌తు ఇవ్వొద్ద‌ని ఉద్యోగ నేత‌లు వెల్ల‌డించారు. కానీ, ఆ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతమైన త‌రువాత తెర‌వెనుక టీడీపీ ఉంద‌నే సంకేతం వెళ్లింది.మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు తెర‌వెనుక రాజ‌కీయ వ్యూహాలు ర‌చించ‌డంలో దిట్ట‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీలో స్టూడెంట్ లీడ‌ర్ గా ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు ఆ పేరుంది. ప్ర‌త్య‌ర్థుల‌ను ఇరుకున‌పెట్టేలా చాణక్యుడిలా ప‌థ‌కాల‌ను ర‌చిస్తాడ‌ని క్లాస్ మేట్స్ చెబుతుంటారు. అందుకే, ఆ రోజుల్లో ఎస్వీ యూనివ‌ర్సిటీ విద్యార్థి ఎన్నిక‌ల్లో ఎప్పుడూ ఆయ‌న‌దే పైచేయిగా ఉండేద‌ట‌. పిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న అన‌తికాలంలోనే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ను సాధించాడు. ఆనాడు గ‌ల్లా రాజ‌గోపాల్ నాయుడులాంటి ఉద్ధండులు ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిత్వాన్ని పొందడం బాబు రాజ‌కీయ చ‌తుర‌త‌కు మ‌చ్చు తున‌క‌. సొంత మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చేరిన చంద్ర‌బాబు తొలి రోజుల్లో కొంత ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌.
సంక్షోభంలోనే అవ‌కాశాల‌ను వెదుక్కోవాల‌ని చంద్ర‌బాబు త‌ర‌చూ చెబుతుంటాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన ఆయ‌న తొలి రోజుల్లో టీడీపీలో ఎదురైన అడ్డంకుల‌ను ఈజీగా తొల‌గించుకున్నాడ‌ట. అంతేకాదు, ఆయ‌న కోసం క‌ర్ష‌క ప‌రిష‌త్ ను సృష్టించుకున్నాడు. ఆ వేదిక‌పై నుంచి తెలుగుదేశం పార్టీలో ప్ర‌యాణాన్ని సుగ‌మం చేసుకున్నాడు. అన్ని రంగాల కంటే రాజ‌కీయాల్లో వ్య‌వ‌సాయ రంగం కీల‌క‌భూమిక పోషిస్తోంది. ఇవాళ్టికి కూడా వ్య‌వ‌సాయ రంగాన్ని, రైతుల‌ను నిర్లక్ష్యం చేసిన ప్ర‌భుత్వాల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మే. అందుకే, ఆనాడే చంద్ర‌బాబు ఆ రంగాన్ని రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఎలా మ‌లుచుకోవాలో ఆలోచించాడు. క‌ర్ష‌క ప‌రిష‌త్ అధ్యక్షుడిగా రైతు నాయ‌కుల‌ను అంద‌ర్నీ క‌లుసుకున్నాడు. రైతుల‌ను సంఘ‌టితం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. తెలుగుదేశం పార్టీ రైతుల ప‌క్ష‌పాతి అనే నినాదాన్ని తీసుకెళ్లాడు. రైతాంగంతో వెనుక‌బ‌డిన, ద‌ళితులు క‌లిసి ఉంటార‌ని బాబు తెలియ‌ని విష‌యం కాదు. ఆయా వ‌ర్గాల‌ను కూడా క‌ర్ష‌క‌ప‌రిష‌త్ ద్వారా ఆక‌ట్టుకున్నాడు. రైతు ఉద్య‌మాల‌ను తీసుకొచ్చాడు. అసంఘటితంగా ఉండే రైతాంగాన్ని సంఘ‌టితంగా మ‌లిచే ప్ర‌య‌త్నం చేశాడు. 1989లో ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన త‌రువాత చంద్ర‌బాబు తెర‌వెనుక ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాడు.

ఇక అక్క‌డ నుంచి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి ఎదురులేని లీడ‌ర్ గా పేరుతెచ్చుకున్నాడు. పార్టీలోనూ అంత‌ర్గ‌తంగా త‌న అభిమానుల‌ను త‌యారు చేసుకున్నాడు. నాదెండ్ల‌ భాస్క‌ర‌రావు వెన్నుపోటు స‌మ‌యంలో చంద్ర‌బాబు చ‌తుర‌త బాగా ప‌నిచేసింది. ఆనాడు ప్ర‌ధాని ఇందిర వ్యూహాల‌కు ప్ర‌తి వ్యూహాల‌ను ర‌చిస్తూ పైచేయి సాధించాడు. గ‌వ‌ర్న‌ర్ రామ్ లాల్ ఎత్తుల‌కు పైఎత్తు వేశాడు. ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా రాత్రింబ‌వ‌ళ్లు కాపాలా కాశాడు. క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో క్యాంపులు నిర్వ‌హించ‌డం ద్వారా ఎక్క‌డిక‌క్క‌డ వ్యూహాల‌ను ర‌చించాడు. ఢిల్లీ తీసుకెళ్లి ఎమ్మెల్యేల‌తో పేరెడ్ పెట్టించాడు. మ‌ళ్లీ తిరిగి ఎన్టీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసేలా ఆనాడు చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్య‌త‌ను ప్ర‌ద‌ర్శించాడు.ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చిన త‌రువాత కూడా చాలా కాలం రాజ‌కీయంగా పార్టీని కాపాడుతూ తెర వెనుక పావులు క‌దిపాడు. ప్ర‌త్య‌క్షంగా ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లి చేసుకోవ‌డంతో ఎన్టీఆర్ ను కాద‌న‌లేక‌పోయాడు. ఆ రోజు నుంచి రాజ‌కీయ చ‌తుర‌త‌ను మార్చాడు. ఎప్పుడు ఎలాంటి ప్ర‌మాదం పార్టీకి ఏర్ప‌డిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం కూలిపోకుండా ఉండేలా తెర‌వెనుక వ్యూహం ర‌చించాడు. లక్ష్మీపార్వ‌తి డైరెక్ట్ ఎంట్రీ రాజ‌కీయాల్లోకి ఇస్తుంద‌ని ప‌సిగ‌ట్టిన ఆయ‌న ముందుగా వేసుకున్న ప‌థ‌కం ప్ర‌కారం న‌డిచాడు. ఆ విష‌యాన్ని స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆనాడు మీడియాముఖంగా చెప్పాడు.

అధికార మార్పిడి జ‌రిగిన త‌రువాత పూర్తి స్థాయిలో ఆయ‌న మైండ్ అంతా ఏపీ అభివృద్ధి దిశ‌గా మ‌ళ్లింది. దీంతో క్ర‌మంగా పార్టీ సంస్థాగ‌తంగా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌చ్చింది. ఫ‌లితంగా 2004లో అధికారాన్ని కోల్పోయాడు. మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి అన్ని ర‌కాలు ఎత్తుగ‌డ‌లు వేశాడు. అయితే, అనూహ్యంగా ప్ర‌జారాజ్యం పార్టీ చిరంజీవి రూపంలో రావ‌డంతో 2009 ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేప‌ట్ట‌లేక‌పోయాడు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ఆయ‌నే చెప్పాడు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలోనూ చాలా కాలం పాటు పార్టీని కాపాడుతూ వ‌చ్చాడు. కొంద‌రు కోట‌రీగా ఏర్ప‌డి ఆయ‌న్ను తొలిసారి త‌ప్పుదోవ ప‌ట్టించారు. రాష్ట్రం విడిపోవ‌డానికి అనుకూలంగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కమిటీకి లేఖ ఇచ్చాడు. అప్ప‌టి నుంచి బాబు చ‌తుర‌త కొంత త‌డ‌బ‌డింది. అయిన‌ప్ప‌టికీ 2014 ఎన్నిక‌ల్లో కొత్త‌గా ఏర్ప‌డిన ఏపీలో అధికారంలోకి వ‌చ్చేలా బీజేపీతో క‌లిసి న‌డిచి అధికారాన్ని సాధించాడు.
కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రం అభివృద్ధి మీద ఎక్కువ‌గా దృష్టిపెట్టాడు. 2050దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తూ వెళ్లాడు. దీంతో సంస్థాగ‌తంగా పార్టీ మ‌ళ్లీ బ‌ల‌హీన ప‌డింది. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బోల్తా ప‌డ్డాడు. జ‌రిగిన త‌ప్పును తెలుసుకుని పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి తెర‌వెనుక ప‌థ‌కాల‌ను ర‌చించాడు. జ‌గ‌న్ స‌ర్కార్ ను ఎప్ప‌టిక‌ప్పుడు ఊపిరిస‌ల‌ప‌కుండా తొలి నుంచి ఎటాక్ చేస్తున్నాడు. ప్ర‌జా వేదిక కూల్చివేతపై తిరుగుబాటు నుంచి అమ‌రావ‌తి ఉద్య‌మ నిర్మాణం, ఇసుక ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా కార్మికుల‌ను న‌డిపించ‌డం, న‌కిలీ మ‌ద్యం పై పోరాటం, డ్ర‌గ్స్‌, నేత‌ల అరెస్ట్ ల‌కు వ్య‌తికంగాపోరాటాలు త‌దిత‌రాల‌తో ఎప్పుడూ పార్టీని లైవ్ లోనే ఉంచుతూ జ‌గ‌న్ స‌ర్కార్ కు విశ్రాంతి లేకుండా చేశాడు. తాజాగా ఉద్యోగులు చేసిన చ‌లో విజ‌య‌వాడ వెనుక వ్యూహ‌ర‌చ‌న చేసి హిట్ అయ్యేలా చేయ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి నిద్ర‌లేకుండా చేశాడు. సో.. చంద్ర‌బాబు తెరచాటు చ‌తురత‌కు మ‌రోసారి హిట్ టాక్ వ‌చ్చింది.