Chandrababu : స్నేహితుడు, శిష్యురాలిపై చంద్ర‌బాబు స్కెచ్

మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, రోజా నియెజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు క‌న్నేశారు. పుంగ‌నూరు, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లోని క్షేత్ర‌స్థాయి రాజ‌కీయాల‌పై ఆయ‌న ప్ర‌త్యేకంగా వ్యూహాల‌ను ర‌చించారు.

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 01:09 PM IST

మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, రోజా నియెజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు క‌న్నేశారు. పుంగ‌నూరు, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లోని క్షేత్ర‌స్థాయి రాజ‌కీయాల‌పై ఆయ‌న ప్ర‌త్యేకంగా వ్యూహాల‌ను ర‌చించారు. కుప్పంలోనే ఈసారి చంద్ర‌బాబును ఓడిస్తామంటూ ప్ర‌చారం చేస్తోన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రాజ‌కీయాల‌కు బ్రేక్ వేసే బాబు స్కెచ్ వేశారు. అంతేకాదు, న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ అంత‌ర్గ‌త గ్రూపు విభేదాల‌ను టీడీపీకి అనుకూలంగా మార్చుకోవ‌డానికి స్కెచ్ వేశారు. మూడు రోజుల పాటు అన్న‌మ‌య్య‌, చిత్తూరు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న చంద్ర‌బాబు నూత‌నోత్సాహాన్ని నింపేలా మినీమ‌హానాడును నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం నాలుగు గంట‌ల‌కు మ‌ద‌న‌ప‌ల్లి చేరుకుని అక్క‌డ జ‌రిగే మినీ మ‌హానాడులో ఆయ‌న పాల్గొంటారు.

ప్ర‌తి వారం జిల్లాల‌కు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే చంద్ర‌బాబు ఈసారి చిత్తూరు, అన్న‌మ‌య్య జిల్లాల్లో ప‌ర్య‌టిస్తారు. షెడ్యూల్ ప్ర‌కారం తొలి రోజు మినీ మ‌హానాడు బ‌హిరంగ స‌భ ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఆ జిల్లాల ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష చేస్తున్నారు. ఆ సంద‌ర్భంగా అభ్య‌ర్థిత్వాల‌ను కూడా కొన్ని చోట్ల ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రికొన్ని చోట్ల ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌ద‌న‌ప‌ల్లి మినీ మ‌హానాడు వేదిక‌గా ఎంపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. అంతేకాదు, కొంద‌రు ఎమ్మెల్యే అభ్య‌ర్థిత్వాల‌ను కూడా ఖ‌రారు చేయ‌నున్నారు. అందుకే, మూడు రోజుల చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై రాయ‌ల‌సీమ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది.

మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేబట్టి, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. అధినేత పర్యటనల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

చిత్తూరు, అన్న‌మ‌య్య జిల్లాల‌కు చెందిన రోజా, పెద్దిరెడ్డి మంత్రులుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పోటీ చేసిన రోజా ఓడిపోయారు. కానీ, వైసీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసి న‌గ‌రి నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ అంత‌ర్గ‌త గ్రూపుల‌తో వైసీపీ బ‌ల‌హీనంగా ఉంద‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే, ఆమెకు చెక్ పెట్టేలా చంద్ర‌బాబు వ్యూహాన్ని ర‌చిస్తూ ముందుగానే అక్క‌డ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం ద్వారా రోజాను నిలువ‌రించాల‌ని చూస్తున్నారు. ఇక పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి, చంద్ర‌బాబు ఇద్ద‌రూ కాలేజీ మేట్ లు. ఎస్వీ యూనివ‌ర్సిటీ కేంద్రంగా విద్యార్థి రాజ‌కీయాల‌ను న‌డిపిన అనుభ‌వం వాళ్ల‌ది.

సుదీర్ఘంగా పెద్దిరెడ్డి మీద పైచేయిగా నిలుస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబునాయుడుపై ఇటీవ‌ల కొంత మేర‌కు పెద్దిరెడ్డి రాజ‌కీయ ఆధిప‌త్యాన్ని ప‌ద‌ర్శిస్తున్నారు. ఆయ‌న వేస్తోన్న రాజ‌కీయ అడుగుల‌కు చెక్ పెట్టేలా బాబు భారీ వ్యూహాల‌ను ర‌చించారు. వాటిని అమ‌లు చేయ‌డానికి దిశానిర్దేశం ఈసారి ప‌ర్య‌ట‌న‌లో స్థానిక క్యాడ‌ర్ కు ఇవ్వ‌నున్నారు. మొత్తం మీద రోజా, పెద్దిరెడ్డి మాత్ర‌మే కాదు, చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు, అన్న‌మ‌య్య జిల్లాల‌పై టీడీపీ జెండాల్ని తిరుగులేకుండా ఎగుర‌వేయ‌డానికి బాబు చాణ‌క్యాన్ని ఈ మూడు రోజుల ప‌ర్య‌ట‌న ద్వారా ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు.