Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu London Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) సతీమణి భువనేశ్వరితో కలిసి రేపు (శనివారం) రాత్రి లండన్‌కి బయలుదేరనున్నారు

Published By: HashtagU Telugu Desk
Cbn Uk

Cbn Uk

అమరావతి, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) సతీమణి భువనేశ్వరితో కలిసి రేపు (శనివారం) రాత్రి లండన్‌కి బయలుదేరనున్నారు. వ్యక్తిగత పర్యటనతో పాటు అంతర్జాతీయ స్థాయి అవార్డు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నవంబర్ 4న లండన్‌లో జరగనున్న గ్లోబల్ కన్వెన్షన్ సందర్భంగా నారా భువనేశ్వరి రెండు విశిష్ట గౌరవాలను అందుకోనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ఆమెను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు – 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, పారదర్శకత, సామాజిక ప్రభావం, మహిళా సాధికారిత రంగాల్లో ఆమె అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రకటించారు.

హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు – గవర్నెన్సులో అగ్రస్థానంలో సంస్థ

భువనేశ్వరి ఎండీగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు “ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్” విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు – 2025 లభించింది. ఎఫ్ఎంసీజీ రంగంలో పారదర్శక పాలన, నాణ్యతా ప్రమాణాలు, సామాజిక బాధ్యత, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలను సమగ్రంగా అమలు చేస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డు సంస్థ స్థాపక విలువలకు ప్రతీకగా నిలిచింది. ఇంతకు ముందు ఈ అవార్డును భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ గోపిచంద్ హిందూజా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంగ్వీ వంటి ప్రముఖులు అందుకున్నారు. భువనేశ్వరి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.

పారిశ్రామిక వేత్తలతో సీఎం సమావేశాలు – సిఐఐ సదస్సుకు ఆహ్వానం

లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు లండన్‌లోని పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులను స్వయంగా ఆహ్వానించనున్నారు. అలాగే ప్రవాసాంధ్రులతో కూడా సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. నవంబర్ 6న సీఎం తిరిగి స్వదేశానికి రానున్నారు. భువనేశ్వరి సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు ఆమె వ్యక్తిగత ప్రతిభతో పాటు, తెలుగు మహిళా నాయకత్వానికి కొత్త గౌరవాన్ని తీసుకువచ్చిందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు అభినందిస్తున్నాయి.

  Last Updated: 31 Oct 2025, 08:39 PM IST