AP Tour : ప్రధాని మోడీ ఈరోజు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయిత మోడీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.
కాగా, ప్రధాని మోడీ దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తరువాత ఏపీ పునర్విభజన చట్టం మేరకు విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. విశాఖ కేంద్రంగా ఈ జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభం అవుతుంది. దీంతో, ఏపీలోని పలు డివిజన్ రైల్వే కార్యాలయాలు ఈ జోన్ పరిధిలో పని చేయను న్నాయి. అయితే, కీలకమైన వాల్తేరు డివిజన్ విషయంలో మాత్రం రైల్వే శాఖ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
జోన్ ప్రధాన కార్యాలయంకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి జాతికి అంకితమివ్వనున్నారు.ఇదే సమయంలో అనకాపల్లి జిల్లాలో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి దగ్గర బల్క్‌డ్రగ్ పార్క్, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, 3 రైల్వే లైన్లు, 6 రైల్వే ప్రాజెక్టులు, 10 రోడ్డు నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో క్రిస్‌సిటీ అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ పట్నంలో రూ.149 కోట్ల విలువైన కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకు స్థాపన చేసేందుకు సర్వం సిద్దమైంది.
కాగా, ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ , ఒడిశాలలో రెండు రోజుల పర్యటనపై ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతో పాటు భువనేశ్వర్ లో జరిగే ప్రవాసి భారతీయ దివస్ వేడుకలలో పాల్గొంటున్నానని వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ , తిరుపతి జిల్లాలోని చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగమైన కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటానని నరేంద్ర మోడీ ట్విటర్‌లో వివరించారు.
Read Also: CBN Security : సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు..ఎందుకో..?