Chandrababu: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన అత్యున్నతమైన రాజ్యాంగం వల్లే దేశంలో సామాన్య పౌరుడు అత్యున్నత స్థాయికి చేరుకోగలుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ గొప్పతనాన్ని ఉద్ఘాటించారు. “ఒకప్పుడు చాయ్‌వాలాగా పనిచేసిన వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం అందించిన హక్కులు, అవకాశాల వల్లే” అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడంలో భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
ఆర్థిక వ్యవస్థలో భారత్ అద్భుత ప్రగతి
దేశ ఆర్థిక ప్రగతి గురించి మాట్లాడిన చంద్రబాబు గత కొన్నేళ్లుగా భారతదేశం సాధించిన ఆర్థిక సంస్కరణలు దేశ గమనాన్ని మార్చేశాయని తెలిపారు. 2014లో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరుకుంది. వచ్చే ఏడాదికల్లా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మన లక్ష్యం అన్నారు. ఈ లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగ స్ఫూర్తితో కూడిన చట్టాలు, సంస్కరణలు దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: Rajamouli: రాజమౌళి ముందు ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఏంటంటే?
ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థే రక్ష
ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పాత్రను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. “ప్రజాస్వామ్యం ఎప్పుడైనా గాడి తప్పినప్పుడు దాన్ని తిరిగి గాడిలో పెట్టే ఏకైక శక్తి న్యాయ వ్యవస్థే” అని చంద్రబాబు అన్నారు. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, పౌరుల హక్కులను, రాజ్యాంగ విలువలను కాపాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన
సమాచార రంగంలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మీడియా రంగంలో ఇటీవలే చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. “సామాజిక మాధ్యమాలలో ప్రతి ఒక్కరూ రైటరే.. ప్రతి ఒక్కరూ ఎడిటరే” అని ఆయన అన్నారు. అయితే, ఈ సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని, వీటిని మరింత బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
