Site icon HashtagU Telugu

Chandrababu : గాంధీజ‌యంతి రోజున జైల్లో చంద్ర‌బాబు నిరాహార‌దీక్ష‌

Chandrababu3

Chandrababu3

తనకు జరిగిన అన్యాయంపై గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు దీక్ష చేయనున్న‌ట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అదే రోజు నారా భువనేశ్వరి కూడా దీక్ష చేసేందుకు నిర్ణయించారని ఆయ‌న తెలిపారు. ఈ దీక్షలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంఘీభావంగా దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయ‌న క్యాడ‌ర్‌కు పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఈ రోజు(శ‌నివారం) రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు రాష్ట్రంలో ప్రతి పౌరుడు వారి ఇళ్లు, వారు ఉన్న ప్రాంతాల్లో ఏదో ఒక రూపంలో సౌండ్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. లోకేష్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గూబ గుయ్యుమన్నట్టుగా మోతమోగించి నిరసన తెలిపారన్నారు. మోత మోగించిన ప్రజానీకానికందరికీ టీడీపీ తరపున ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆధారాలు లేకుండా ఏ మాత్రం సంబంధం లేని చంద్రబాబు నాయుడుని అక్రమంగా 22 రోజుల నుంచి జైల్లో బందించార‌న్నారు. ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో నిలిచిపోయేలా ఈరోజు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ మోతమోగిస్తూ ప్ర‌జ‌లు సంఘీభావం తెలిపారని.. ఇప్పటికైనా భేషరతుగా జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పి చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు ఎత్తివేసి, ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.