Babu Tour : ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు మేల్కోలుపు!గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌నీరాజ‌నం!!

క‌ర్నూలు వేదిక‌గా `ఇవే చివ‌రి ఎన్నిక‌లు` అంటూ చంద్ర‌బాబు చేసిన కామెంట్ తిరిగి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు బ‌హిరంగ స‌భ‌లోనూ ప్ర‌స్తావించారు.

  • Written By:
  • Updated On - December 1, 2022 / 02:51 PM IST

క‌ర్నూలు వేదిక‌గా `ఇవే చివ‌రి ఎన్నిక‌లు` అంటూ చంద్ర‌బాబు చేసిన కామెంట్ తిరిగి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు బ‌హిరంగ స‌భ‌లోనూ ప్ర‌స్తావించారు. ఏపీని బాగుచేసుకోవ‌డానికి ప్ర‌జ‌ల‌కు ` ఇవే చివ‌రి ఎన్నిక‌లు నాకు కాదు…` అంటూ వివ‌రించారు. ఆయ‌న క‌ర్నూలు వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నెగిటివ్ కోణం నుంచి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. ఏడాదిన్నర ముందుగానే ఓట‌మిని ఆ వ్యాఖ్య‌ల ద్వారా చంద్ర‌బాబు అంగీక‌రించార‌ని మంత్రులు ఫోక‌స్ చేశారు. అందుకే మ‌రోసారి ఆ వ్యాఖ్య‌ల్లోని అంత‌రార్థాన్ని తెలియ‌చేసే ప్ర‌య‌త్నం ఏలూరు కేంద్రంగా చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో ఛాన్స్ ఇస్తే 30ఏళ్లు అధికారంలో ఉంటానంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతున్నారు. అంటే, 2024 ఎన్నిక‌లు వైసీపీకి ఎంత కీల‌క‌మో ఆయ‌న మాట‌ల ద్వారా అర్థం అవుతోంది. అలాగే, చంద్ర‌బాబు చెప్పే `ఇవే చివ‌రి ఎన్నిక‌లు` అనే వ్యాఖ్య‌ల వెనుక నిగూర్థాలు లేక‌పోలేదు. ఏదైనా కామెంట్స్ చేసేట‌ప్పుడు చాలా ఆలోచించుకుని చంద్ర‌బాబు చేస్తుంటారు. విజ‌న‌రీగా పేరున్న ఆయ‌న ఐటీ రంగం పీక్ స్టేజ్ ఎలా ఉంటుందో 20ఏళ్ల క్రిత‌మే గుర్తించారు. జనాభా కొర‌త భ‌విష్య‌త్ లో ఉంటుంద‌ని ఇటీవ‌ల ఆయ‌న చెప్ప‌డం ద్వారా స‌మాజాన్ని ఆలోచింప చేస్తున్నారు. ఇక `ఇవే చివ‌రి ఎన్నిక‌లు` అనే వ్యాఖ్య ముందుచూపుతో ఆయ‌న చేశారు. అంటే, వైసీపీ వాళ్లు చెబుతున్న‌ట్టు ఆయ‌న ఓడిపోతార‌ని, ఎన్నిక‌ల నుంచి దూరంగా ఉంటార‌ని అర్థం కాదు.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత తెలంగాణ‌కు స‌మానంగా అన్ని రంగాల‌ను తీసుకెళ్ల‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తూ ఒక వైపు సంక్షేమాన్ని ఇంకో వైపు అభివృద్ధిని పరుగు పెట్టించాల‌ని యోచించారు. ఆ క్ర‌మంలో సంప‌ద సృష్టి కోసం అమ‌రావ‌తి ప్రాజెక్టును చేప‌ట్టారు. విశాఖ ఐటీ హ‌బ్ గా, విజ‌య‌వాడ ఆర్థిక న‌గ‌రంగా, తిరుప‌తి ఆధ్యాత్మిక కేంద్రంగా, అనంత‌పురాన్ని హార్డ్ వేర్ హ‌బ్ గా చేయాల‌ని ప్లాన్ చేశారు. అందుకోసం పునాదులు వేశారు. వాటి మీద విజ‌న్ ను సాకారం చేసే క్ర‌మంలో 2019 ఎన్నిక‌లు రావ‌డం జ‌రిగింది. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం అయ్యారు. దీంతో ఆయ‌న త‌యారు చేసిన విజ‌న్ మూల‌న‌ప‌డింది.

`ఒక వేళ 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీఎం కొన‌సాగి ఉంటే ఏపీ ఎలా ఉండేదో ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లు ఊహించుకుంటున్నారు. క‌రోనా సంద‌ర్భంగా రాష్ట్రానికి వ‌చ్చిన ఏ టెక్కీ తిరిగి వెళ్ల‌కుండా అన్నీ ఏర్పాట్లు ఏపీలోనే జ‌రిగేవి. ఐటీ రంగం ఏపీలో ఊపందుకునేది. విశాఖ కేంద్రంగా చేసుకున్న 25ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే పారిశ్రామిక ఒప్పందాల్లో క‌నీసం 30 నుంచి 50శాతం కార్యాచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేవి. అప్పుడు తెలంగాణ‌కు వ‌ల‌స‌లు ఏపీ నుంచి ఆగేవి. హైద‌రాబాద్ ఎయిర్ పోర్టు కంటే గ‌న్న‌వ‌రం, తిరుప‌తి , విశాఖ విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండేది. కోస్తా కారిడార్ సాకారం అయ్యేది. విశాఖ‌, విజ‌య‌వాడ మెట్రో ప‌నులు జ‌రుగుతుండేవి. పోల‌వరం, అమ‌రావ‌తి రాజ‌ధాని పూర్త‌య్యేవి. ప్ర‌పంచంలోనే మోడ‌ల్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మెరిసిపోయేది. విదేశీ పెట్టుబ‌డులు భారీగా వ‌చ్చేవి..` అంటూ చంద్ర‌బాబు విజ‌న్ గురించి తెలిసిన వాళ్లు చెప్పే మాట‌. క‌నీసం 2024 ఎన్నిక‌ల్లోనైనా చంద్ర‌బాబు సీఎం అయితే మూల‌న‌ప‌డ్డ విజ‌న్ ను బ‌య‌ట‌కు తీస్తార‌ని టీడీపీ అభిమానుల ఆశ‌. ఆ కోణం నుంచి `ఇవే చివ‌రి ఎన్నిక‌లు` అనే కామెంట్ ను వాళ్లు చూస్తున్నారు.

ఏపీలో `రూల్ ఆఫ్ లా` ఎక్క‌డా క‌నిపించ‌డంలేద‌ని హైకోర్టు నుంచి గ‌త ఏడాది బ‌దిలీ అయిన జ‌డ్జి చేసిన వ్యాఖ్య‌లు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన అనేక మందిని మూడేళ్లుగా అరెస్ట్ చేశారు. సోష‌ల్ మీడియాను క‌ట్ట‌డీ చేసేందుకు సీఐడీని తేలిగ్గా వాడేశారు. వాలంటీర్ల ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ల మ‌నోభావాల‌పై రైడ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వానికి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిక వ్య‌తిరేకంగా మాట్లాడితే వెంట‌నే పోలీసులు వాళ్ల ఇంటిలో వాలిపోతున్నారు. ఇవ‌న్నీ చూసిన త‌రువాత 2024లోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి `మ‌రో ఛాన్స్` ఇస్తే ఇక ఎన్నిక‌ల‌ను మ‌ర‌చిపోవ‌డ‌మేన‌ని కొంద‌రు భావిస్తున్నారు. అందుకే, 2024 ఎన్నిక‌ల నెగ్గితే 30ఏళ్ల పాటు ఇక తానే సీఎం అంటూ జ‌గన్మోహ‌న్ రెడ్డి చెబుతున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు. క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల దాకా జ‌రిగిన ఎన్నిక‌ల ప్రక్రియ అందరికీ తెలిసిందే. ఒక వేళ `మ‌ళ్లీ ఛాన్స్` ఇస్తే క‌డ‌ప త‌ర‌హా ప‌రిస్థితులు ఏపీ వ్యాప్తంగా వ‌స్తాయ‌ని ఆందోళ‌న చెందే వాళ్లు లేక‌పోలేదు. అంటే, పోలింగ్ బూత్ ల వ‌ర‌కు ఓట‌ర్లు వెళ్లే ప‌రిస్థితి ఉండ‌ద‌ని చంద్ర‌బాబు అండ్ టీమ్ ఆలోచ‌న‌. అందుకే, 2024 ఎన్నిక‌లు ప్ర‌జ‌ల‌కు చివ‌రి ఎన్నిక‌లు అంటూ ముందుగా ప్ర‌జ‌ల్ని చంద్ర‌బాబు అప్ర‌మ‌త్తం చేస్తున్నార‌ని టీడీపీ చెబుతోంది.

`ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి` అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు ఏలూరు బ‌హిరంగ స‌భ‌లోనూ `ఇవే చివ‌రి ఎన్నిక‌లు ప్ర‌జ‌ల‌కు..` అంటూ గుర్తు చేశారు. గురువారం పోలవరం వ‌ద్ద‌ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంత‌రం కొవ్వూరులో నిర్వ‌హించే రోడ్‌ షోలో రాత్రి 8గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం నిడదవోలులో జరిగే రోడ్‌ షోలో పాల్గొని బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు నిడదవోలు నుంచి తాడేపల్లి గూడెం మండలం నవాబుపాలెంలో రైతులతో సమావేశం అవుతారు. అక్కడ నుంచి తాడేపల్లిగూడెం వచ్చి అక్క‌డ నిర్వ‌హించే రోడ్‌షో అనంత‌రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఈ స‌భ‌ల‌న్నింటిలోనూ `ఇవే చివ‌రి ఎన్నిక‌లు` అంశాన్ని ప్ర‌స్తావించ‌డం ద్వారా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.