Site icon HashtagU Telugu

Chandrababu : నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయ్యింది

Chandrababu (2)

Chandrababu (2)

సీఎంపై రాయి వేసిన ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసు పాలయ్యిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ ఆయన ప్రజాగళంలో సభలో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నానని, తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని, సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో వైసీపీ అభాసుపాలయ్యిందని ఆయన పేర్కొన్నారు. హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద వేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజలు ఛీ కొట్టడంతో ఆ పార్టీ పీకల్లోతు బురదలో కూరుకుపోయిందని, నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారన్నారు. వీళ్లే నిందితులంటూ వడ్డెర కాలనీ యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, అసలు రాయి విసిరింది ఎవరు..? కారణాలు ఏంటి..? వాస్తవాలు ఏమిటో చెప్పకుండా మళ్లీ కుట్రలకు ప్రభుత్వం నీచపు ప్రయత్నాలు చేస్తోందన్నారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పడం కోసం, నమ్మించడం కోసం పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోందని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టీడీపీ ముఖ్య నేతలను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో పావులు కదుపుతోందన్నారు చంద్రబాబు. దీనికోసం నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని, దీనిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను కేసులో ఇరికించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. కీలక ఎన్నికల సమయంలో బోండా ఉమా ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోందని, ఈ ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు..

అంతేకాకుండా.. ‘నేడు మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం.. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా… జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో చాలా కఠినంగా శిక్షించబడతారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలి. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణా బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలి.’ అని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Read Also : CM Revanth: ఆ నాలుగు లోక్‌సభ స్థానాలతో రేవంత్‌కు గట్టిపోటీ.. కారణాలివే

Exit mobile version