AP Politics : చంద్ర‌బాబు `పొత్తు` ఫ‌టాఫ‌ట్‌!

రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు దాదాపుగా ఖారారు అయింద‌ని జాతీయ మీడియా హోరెత్తిస్తోంది.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 01:13 PM IST

రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు దాదాపుగా ఖారారు అయింద‌ని జాతీయ మీడియా హోరెత్తిస్తోంది. గ‌త రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఆ మూడు పార్టీల కూట‌మి మీద చ‌ర్చించుకుంటున్నారు. కానీ, ఆ పార్టీల‌ పొత్తు క్షేత్ర‌స్థాయిలో విక‌టించేలా క‌నిపిస్తోంద‌ని ప్రముఖ స‌ర్వే సంస్థ‌ల అంచ‌నా. ఏపీకి ద్రోహం చేసిన పార్టీగా ఉన్న బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ కు అండ‌గా ఉండ‌డంతో పాటు ప‌లు వ్య‌తిరేక అంశాల‌ను ఆయా సంస్థ‌లు సూచిస్తున్నాయి. ఒక వేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ నిండా మునుగుతుంద‌ని ఆ స‌ర్వేల్లోని సారంశం. అలా కాకుండా జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏక్ నాథ్ షిండే త‌ర‌హా నాయ‌కుడు పుట్టుకొస్తార‌ని ప్ర‌చారం జరుగుతోంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు చ‌తుర‌త ఆయ‌న కెరీర్ తొలి అంకంలో బాగా ప‌నిచేసింది. ఆ త‌రువాత కొన్ని మీడియా సంస్థ‌లు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల మీద ఆయ‌న ఆధార‌ప‌డ్డారు. అప్ప‌టి నుంచి బోల్తా ప‌డుతూ వ‌స్తున్నారు. ముంద‌స్తుకు వెళ్ల‌మ‌ని 2004 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు సానుభూతి మీడియాగా చెప్పుకుంటోన్న వాళ్లు స‌ల‌హాలు ఇచ్చారు. సీన్ క‌ట్ చేస్తే, ఘోరంగా అధికారాన్ని కోల్పోయారు. ఆ త‌రువాత అదే మీడియా తెలంగాణ‌కు అనుకూలంగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ క‌మిటీకి లెట‌ర్ ఇప్పించ‌డం ద్వారా 2009 ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి ఏర్పాటుకు మార్గం సుగ‌మ‌మం చేసింది. సీన్ క‌ట్ చేస్తే ఆ ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాల్సి వ‌చ్చింది. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడుతోన్న టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బాబు మాట్లాడేలా ఆ మీడియా చేసింది.

ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌ రాజ‌కీయాల‌కు కొత్త కావ‌డంతో అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు ఏపీ ప్ర‌జ‌లు విజ్ఞ‌త‌తో ఆలోచించి 2014 లో అధికారాన్ని ఇచ్చారు. ఆ త‌రువాత సానుభూతి మీడియా 2018 నాటికి చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌పై స్వారీ చేసింద‌ని టీడీపీలోని కోర్ టీమ్ ఇప్ప‌టికీ చెప్పుకుంటోంది. ఓటుకు నోటు కేసు నుంచి అమ‌రావ‌తి రాజ‌ధాని దాకా ఆ మీడియా క‌నుస‌న్న‌న‌లోనే ఆనాటి బాబు స‌ర్కార్ న‌డిచింద‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అందుకే, 2019 ఎన్నిక‌ల్లో ఘోరాతి ఘోరంగా 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ప్రభుత్వం కూలిపోయింది. గ‌త మూడేళ్లుగా పోరాడుతోన్న క్యాడ‌ర్ కు 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌న్న ధీమాను సోష‌ల్ మీడియా ద్వారా టీడీపీ తీసుకొచ్చింది.

ప్ర‌స్తుతం మ‌ళ్లీ కొంద‌రు మీడియా అధిప‌తులు, పారిశ్రామిక‌వేత్త‌లు సంయుక్తంగా బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మి కోసం పావులు క‌దిపార‌ని తెలుస్తోంది. అక్ర‌మ ఆస్తుల్ని కాపాడుకోవ‌డం కోసం పారిశ్రామిక‌వేత్త‌లు, 2014 నుంచి 2019 వ‌ర‌కు ఆయాచితంగా ల‌బ్దిపొందిన కొంద‌రు మీడియా అధిప‌తులు పొత్తు చ‌క్రం తిప్పార‌ని పార్టీలోని గుస‌గుస‌లు. వాళ్ల కోసం బీజేపీతో పొత్తుకు చంద్ర‌బాబు సై అంటున్నార‌ని సీనియ‌ర్లు సైతం మాట్లాడుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఒక వేళ కూట‌మి బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వ‌స్తే చంద్ర‌బాబును సీఎంగా ఎంత కాలం ఉండ‌నిస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే 2024 ఎన్నిక‌ల్లో కింగ్ మేక‌ర్ గా బీజేపీ చెప్పుకుంటోంది. రాజ్యాధికారం దిశ‌గా మాత్ర‌మే పొత్తులుంటాయ‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీలో మ‌హారాష్ట్ర త‌ర‌హా ఏక్ నాథ్ షిండే పుట్ట‌డ‌ని గ్యారంటీ ఏమిటి? అనే ప్ర‌శ్న టీడీపీలోని కొంద‌రికి గుబులు పుట్టిస్తోంది. సింగిల్ గా వెళ్లిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తార‌ని మెజార్టీ స‌ర్వేల సారాంశం. అయిన‌ప్ప‌టికీ పొత్తుల దిశ‌గా టీడీపీ ముందుడుగు వేయ‌డం 2004, 2009 త‌ర‌హాలో చేదు అనుభ‌వాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని హార్డ్ కోర్ టీడీపీ నేత‌ల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి!