Site icon HashtagU Telugu

Pawan Kalyan Vs Jr NTR : ఎవ‌రి క్రేజ్ ఎంత‌..!

Babu Pawan Ntr

Babu Pawan Ntr

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోలుగా ప‌వ‌న్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఎవ‌రికి ఉండే క్రేజ్ వాళ్ల‌కు ఉంది. ఆ ఇద్ద‌రి హీరోల కాల్షీట్లు దొర‌క‌డం చాలా క‌ష్టం. ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక‌ర్ని మించి మ‌రొక‌రికి ఉంటుంది. క‌లెక్ష‌న్ల విష‌యంలోనూ ఎవ‌రూ తీసిపోరు. సినిమా విడుద‌ల రోజు థియేట‌ర్ల వ‌ద్ద హంగామా చూస్తే ఆ ఇద్ద‌రి హీరోల హ‌వా ఏంటో అర్థం అవుతోంది. బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం బ్యాక్ గ్రౌండ్ ఉంది. కుటుంబ నేప‌థ్యంలోనూ ఎవ‌రికివారే బ‌ల‌మైన హీరోలు. రాజ‌కీయంగా మాత్రం ఇద్ద‌రూ ఒడిదుడుక‌ల‌ను ఫేస్ చేస్తున్నారు. చంద్ర‌బాబు నీడ వాళ్లిద్ద‌రిపైన బ‌లంగా ఉంది.ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున యువ‌రాజ్యం అధ్యక్షుని బాధ్య‌త‌ల‌ను ప‌వ‌న్ నిర్వ‌హించాడు. ఉమ్మ‌డి ఏపీ లో జ‌రిగిన 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జా రాజ్యం పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశాడు. ఆనాడు ఆయ‌న చేసిన ప్ర‌చారానికి అనూహ్యంగా స్పంద‌న వ‌చ్చింది. మెగా కుటుంబంలోని హీరోలు అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌త్యేక రైలును బుక్ చేసుకుని ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌త్యేకించి ప‌వ‌న్ ప్ర‌చారానికి యూత్ లో స్పంద‌న ఆనాడు ల‌భించింది. ఆ విష‌యాన్ని స‌ర్వేలో ద్వారా అప్ప‌ట్లో చంద్ర‌బాబు గ‌మ‌నించాడు.

ప‌వ‌న్ ప్ర‌చారానికి ధీటుగా యూత్ ను ఆక‌ర్షించే జూనియ‌ర్ ఎన్టీఆర్ ను 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌యోగించాడు. ఆ ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశాడు. ఆనాడు బాబు చేసిన ప్ర‌యోగం హిట్ అయింది. ప‌వ‌న్ కు ఏ మాత్రం తీసిపోకుండా యూత్ ఫాలోయింగ్ జూనియ‌ర్ కు ల‌భించింది. ఉత్త‌రాంధ్ర‌, తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో జూనియ‌ర్ ప్ర‌చారం చేశాడు. అనూహ్య స్పంద‌న జూనియ‌ర్ ప్ర‌చారానికి వచ్చింది. అంతేకాదు, సీనియ‌ర్ ఎన్టీఆర్ నిజ‌మైన వార‌సుడు వ‌చ్చాడంటూ క్యాడ‌ర్ లో న‌మ్మ‌కం ఏర్ప‌డింది. సీనియ‌ర్ ఎన్టీఆర్ గెట‌ప్ (ఖ‌ద్దురు ష‌ర్ట్‌, ప్యాంట్)లో జూనియ‌ర్ చేసిన ప్ర‌సంగం యువ‌త‌ను ఉర్రూత‌లూగించింది. నంద‌మూరి కుటుంబానికి మ‌ళ్లీ టీడీపీ వ‌చ్చేస్తుంద‌ని క్యాడ‌ర్ భావించింది. ఆ సంకేతాల‌ను గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఆక‌స్మాత్తుగా ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న‌తో జూనియ‌ర్ ప్ర‌చారానికి బ్రేక్ వేశాడు. కానీ, ఆనాడు జూనియ‌ర్ చేసిన ప్ర‌చారాన్ని ఇప్ప‌టికే క్యాడ‌ర్ మ‌రువ‌లేక‌పోతోంది.
2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జా రాజ్యం త‌ర‌పున ప‌వ‌న్, టీడీపీ త‌ర‌పున జూనియ‌ర్ హైలెట్ గా నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చింది. కొన్ని రోజుల త‌రువాత ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయింది. దీంతో ప‌వ‌న్ మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. 2014 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు సైలెంట్ గా ఉన్న ఆయ‌న జ‌న‌సేన పార్టీని స్థాపించాడు. దీంతో చంద్ర‌బాబు సామాజిక ఈక్వేష‌న్స్ ను ప‌రిశీలించాడు. ప‌వ‌న్ మ‌ద్ధ‌తుతో కాపు ఓటు బ్యాంకును ఆకర్షించ‌డానికి వీలుంద‌ని అంచ‌నా వేశాడు. అప్ప‌టికే కాంగ్రెస్ మీద వ్య‌తిరేక‌త‌తో ఉన్న ప్ర‌జ‌లు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నార‌ని గ‌మ‌నించిన బాబు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓడించ‌డానికి యూత్ ఓట‌ర్లు ముఖ్య‌మ‌ని భావించిన బాబు 2014 ఎన్నిక‌ల వేదిక‌ల‌పై ప‌వ‌న్ ను ఎక్కించాడు. ఫ‌లితంగా 2014 ఎన్నిక‌ల్లో విడిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సీఎం అయ్యాడు.

తెర‌వెనుక ప‌నిచేసిన లోకేష్ ను మంత్రి రూపంలో ప్ర‌భుత్వంలోకి తీసుకున్నాడు. రాజ‌కీయ వార‌సునిగా ఫోక‌స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. ఆ క్ర‌మంలో జూనియ‌ర్ అభిమానుల నుంచి వ్య‌తిరేక‌త వినిపించింది. దీంతో ఆయ‌న సినిమాల‌పై చంద్ర‌బాబు కోట‌రీ ఫోక‌స్ చేసింది. జూనియ‌ర్ సినిమాలు విడుద‌ల‌కు ముందే టీడీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్లాప్ టాక్ ను న‌డిపే వాళ్లు. హిట్ సినిమాల‌ను కూడా ప్లాప్ కింద లెక్కించేలా ప్ర‌చారం చేసిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. కొంద‌రు నిర్మాత‌ల‌ను కూడా జూనియ‌ర్ కు దూరం చేయాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు టీడీపీలోని జూనియ‌ర్ అభిమానులు గ్ర‌హించారు. సినిమాల్లో జీరో చేయ‌డం ద్వారా జూనియ‌ర్ కు ఉన్న క్రేజ్ ను త‌గ్గించాలని ప‌లు వ్యూహాల‌ను అమ‌లు చేశార‌ని టాక్‌. పైగా ఆయ‌న మామ నార్నే శ్రీనివాస‌రావు 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా వైసీపీలోకి వెళ్లాడు. దీంతో జూనియ‌ర్ కూడా ప‌రోక్షంగా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు అంటూ నారా అభిమానులు ప్ర‌చారం చేశారు. మొత్తం మీద టీడీపీలోనే నంద‌మూరి, నారా అభిమానుల మ‌ధ్య జూనియ‌ర్ రాజ‌కీయ క్రేజ్ ఫ్రీజ్ అయింది.2019ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్ కూడా టీడీపీకి దూరం అయ్యాడు. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంపై టీడీపీ దాడి చేసింది. మూడు పెళ్లిళ్ల నుంచి ప్ర‌జారాజ్యం పార్టీని విలీనం చేసిన వైనాన్ని చెబుతూ వీలున్నంత వ‌ర‌కు ప‌వ‌న్ క్రేజ్ ను డ్యామేజ్ చేసింది. ముక్కోణ‌పు పోటీలో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో మ‌ళ్లీ ప‌వ‌న్ అండ కోసం బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. పొత్తు మాట‌ల్లో ఒన్ సైడ్ ల‌వ్ అంటూ ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల్లోని ఆంత‌ర్యం అందరికీ తెలిసిందే. పైగా ఉమ్మ‌డి శ‌త్రువుగా జ‌గ‌న్ ను టీడీపీ, జ‌న‌సేన భావిస్తున్నాయి. సామాజిక ఈక్వేష‌న్ కు ప్రాధాన్యం ఇచ్చే చంద్ర‌బాబు 2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ అండ కావాల‌ని మ‌ళ్లీ కోరుకుంటున్నాడు. అందుకే, బీమ్లా నాయ‌క్ సినిమాను హిట్ చేసే ప‌నిలో టీడీపీ నిమ‌గ్నం అయింది. అదే సంద‌ర్భంలో జూనియ‌ర్ సినిమాల‌ను ప్లాప్ చేయ‌డానికి తెర‌వెనుక ప్ర‌య‌త్నం నారా అభిమానులు చేస్తున్నార‌ని నంద‌మూరి అభిమానుల అనుమానం.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న‌ల‌న్నీ రాజ‌కీయ ఈక్వేష‌న్స్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆయ‌న ఏది చేసినా రాజ‌కీయ కోణం నుంచే చూడాల్సిందే. ఎందుకంటే, 40ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ జీవితంలోనే ఉన్నాడాయ‌న‌. తెలుగుదేశం పార్టీకి ఏది లాభం? ఎవ‌ర్ని ద‌గ్గ‌ర‌కు తీసుకుంటే సానుకూల‌త ఉంటుంది? ఇలాంటి ఈక్వేష‌న్స్ ఎప్పుడూ ఆయ‌న చుట్టూ న‌డుస్తుంటాయి. తొలి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ పైన బాబు న‌మ్మ‌కం. అందుకే, 2014 ఎన్నిక‌ల‌కు ముందు నేరుగా ప‌వ‌న్ ఇంటికి బాబు వెళ్లాడు. ఆయ‌న అండ‌ను కోరుకున్నాడు. జూనియ‌ర్ కంటే ప‌వ‌న్ బెట‌ర్ అనే అభిప్రాయానికి వ‌చ్చాడ‌ని తెలుస్తోంది. సామాజిక ఈక్వేష‌న్ ప‌రంగా ప‌వ‌న్ ఫేస్ తో కాపు ఓటు బ్యాంకు వ‌స్తుంద‌ని బాబు లెక్క‌ట‌. అదే, జూనియ‌ర్ సామాజిక‌వ‌ర్గం ఎప్పుడూ టీడీపీకే ఉంటుంద‌ని ఆయ‌న అంచ‌నా. సో..ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జూనియ‌ర్ కంటే ప‌వ‌న్ అండ బాబుకు ముఖ్యమ‌ని టీడీపీలోని ఒక వ‌ర్గం భావిస్తోంది. అందుకే, ఎవ‌ర్ గ్రీన్ ప‌వ‌న్ అంటూ ప్ర‌శంసిస్తూ జూనియ‌ర్ క్రేజ్ ను త‌క్క‌వ అంచ‌నా వేస్తున్నారు. క్రేజీ హీరోల‌పై ఇలాంటి ఈక్వేష‌న్ బాబుకు క‌లిసొస్తుందా? అస‌లుకే మోసం వ‌స్తుందా? అనేది చూడాలి.