Chandrababu Naidu : చంద్ర‌బాబు “షాడో”స్.!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబును కొంద‌రు విజ‌న‌రీ అంటారు. మ‌రికొంద‌రు అడ్మినిస్ట్రేట‌ర్ గా భావిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - December 3, 2021 / 02:53 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబును కొంద‌రు విజ‌న‌రీ అంటారు. మ‌రికొంద‌రు అడ్మినిస్ట్రేట‌ర్ గా భావిస్తుంటారు. ఇంకొంద‌రు రాజ‌కీయ చాణిక్యుడుగా త‌ల‌పోస్తుంటారు. ఒక మంచి సీఈవోకు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న వాళ్లు చెప్పుకుంటుంటారు. న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఒక్కో స‌మ‌యంలో ఒక్కో విధంగా ఆయ‌న క‌నిపించాడు.స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నుంచి పార్టీని, సీఎం ప‌ద‌విని పొందిన‌ప్పుడు రాజ‌కీయ చాణిక్యుడిగా క‌నిపించాడు. వ్యూహాత్మ‌కంగా ఎన్టీఆర్ లాంటి యుగ‌పురుషుడ్ని రాజ‌కీయంగా ఎదుర్కొన్నాడు. ఆనాడు మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ను కాద‌ని చంద్ర‌బాబు ప‌క్షాన నిలిచారు. వైశ్రాయ్ సంఘ‌ట‌న గురించి బాగా తెలిసిన వాళ్లు బాబు రాజ‌కీయ చ‌తుర‌త ఎలా ఉంటుందో చెబుతారు. అప్ప‌టిక‌ప్పుడు ఎమ్మెల్యేలు అంద‌రూ ఆయ‌న ప‌క్షాన రాలేద‌ని ఆనాడున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు విశ్లేషిస్తారు. 1994 ఎన్నిక‌ల‌కు పూర్వ‌మే, అనుచ‌రుల‌కు ఎమ్మెల్యే టిక్కెట్ల‌ను బాబు ఇప్పించుకున్నాడ‌ట‌. ముందుగానే రచించుకున్న వ్యూహం ప్ర‌కారం ఎమ్మెల్యేలు బాబు ప‌క్షాన చేరార‌ట‌. ఆ సంఘ‌ట‌న బాబులోని రాజ‌కీయ చ‌తుర‌త‌కు అద్దం ప‌ట్టింది.

New UPA: హ‌స్తిన చ‌క్రంపై ఆ ఆరుగురు.!

ముఖ్య‌మంత్రిగా 1995లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఉమ్మ‌డి ఏపీని అభివృద్ధి ప‌థాన న‌డిపించాడని చాలా మంది భావిస్తుంటారు. రాజ‌ధాని హైద‌రాబాద్ ను ప్ర‌పంచ ప‌టంలో బాబు నిలిపాడు. ఉమ్మ‌డి రాష్ట్రం రెవెన్యూ లోని సింహ‌భాగం హైద‌రాబాద్ చుట్టూ ఖ‌ర్చు పెట్టాడు. ఔట‌ర్ రింగ్ రోడ్డు, విమానాశ్ర‌యం, హైటెక్ సిటీ, హైటెక్స్, స‌మావేశ మందిరాలు, గోల్ఫ్ కోర్స్, అంత‌ర్జాతీయ స్టేడియాలు..ఇలా ఒక రంగుల ప్ర‌పంచాన్ని డిజైన్ చేశాడు.
ఆయ‌న సీఎంగా బాధ్య‌త‌లు స్వీకరించేనాటికి హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రెవెన్యూ 40శాతం ఉండ‌గా మిగిలిన 60శాతం ఆంధ్రా, రాయ‌ల‌సీమ రెవెన్యూ ఉండేది. ఆంధ్రా, సీమ రెవెన్యూలోని 90శాతం హైద‌రాబాద్ చుట్టూ అత్యాధునిక వ‌న‌రుల రూప‌క‌ల్ప‌న‌కు ఖ‌ర్చు పెట్టాడు. 2004లో ఆయ‌న సీఎంగా దిగిపోయేనాటికి హైద‌రాబాద్ తో కూడిన తెలంగాణ రెవెన్యూ 55శాతం, ఆంధ్రా, రాయ‌ల‌సీమ రెవెన్యూ 45కు ప‌డిపోయింది. అందుకే, ఆ స‌మ‌యంలో బాబును విజ‌న‌రీగా చాలా మంది చూశారు.

ముఖ్య‌మంత్రిగా 1995 నుంచి 2004 వ‌ర‌కు చంద్ర‌బాబు ఉన్నాడు. ఆ స‌మ‌యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప‌వ‌ర్ ను బాగా ఎంజాయ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఎగ్జిక్యూటివ్స్ కు ఎక్కువ ప్రాధాన్యం బాబు ఇచ్చాడట‌. టిక్కెట్ల ఖరారుకు కూడా 2004 ఎన్నిక‌ల్లో కొంద‌రు ఐఏఎస్, ఐపీఎస్ ల స‌ల‌హాలను బాబు తీసుకున్నాడు. ఆ మేర‌కు అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేశాడు. అంతేకాదు, ఆయ‌న సీఎంగా ఉన్న స‌మ‌యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారుల వ‌ద్ద చేతులు క‌ట్టుకుని నిల్చునే వాళ్లు. ఒక‌రిద్ద‌రు మంత్రులు మిన‌హా ఎవ‌రినీ అధికారులు పెద్ద‌గా కేర్ చేసేవాళ్లు కాదు. ఎప్పుడూ అధికారుల‌తోనే ఎక్కువ‌గా చంద్ర‌బాబు ఉండేవాడు. అందుకే, మంచి అడ్మినిస్టేట‌ర్ గా చంద్ర‌బాబు కు ఆనాడు గుర్తింపు వ‌చ్చింది. ఆయ‌న రివ్యూ మీటింగ్ లు, అడ్మినిస్ట్రేష‌న్ ను ద‌గ్గ‌ర నుంచి చూసిన వాళ్లు ఒక మంచి సీఈవో ల‌క్ష‌ణాలు బాబులో ఉన్నాయ‌ని కొంద‌రు కితాబు ఇచ్చే వాళ్లు.
రాజ‌కీయ చాణిక్యుడిగా పేరున్న చంద్ర‌బాబు గ్రాఫ్ 2004 నుంచి ప‌డిపోతూ వ‌చ్చింది. ఒక లీడ‌ర్ గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డంలేద‌ని పార్టీలోనే కొంద‌రు 2009 ఎన్నిక‌ల త‌రువాత తిర‌గ‌బడ్డారు. ఇక పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని స్వ‌ర్గీయ వైఎస్ ప‌క్షాన చాలా మంది ఆనాడు చేరిపోయారు. ఇక నంద‌మూరి ఫ్యామిలీకి పార్టీని అప్ప‌గించాల‌ని బ‌లంగా స్లోగ‌న్ ఆనాడు వినిపించింది. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంగా ఆయ‌న్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్ర‌త్యేక తెలంగాణ సెంటిమెంట్ ను గౌర‌విస్తూ ప్ర‌ణ‌బ్ క‌మిటీకి లేఖ ఇచ్చాడు.

Also Read : చంద్ర‌బాబు మంచిత‌న‌మే..మైన‌స్.!

ఆనాటి నుంచి ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ త‌డ‌బడుతూ వ‌చ్చింది. అక‌స్మాత్తుగా వైఎస్ మ‌ర‌ణించ‌డంతో జ‌గన్ రూపంలో టీడీపీకి బ‌ల‌మైన శ‌క్తి ఎదురైయింది. రాజ‌కీయంగా జ‌గన్మోహ‌న్ రెడ్డిని ఎదుర్కోవ‌డానికి చంద్ర‌బాబుకు అండ‌గా నిలుచుకునే నాయ‌కులే టీడీపీలో క‌రువ‌య్యారు. అధికారంలో ఉండ‌గా స‌ర్వం అనుభ‌వించిన వాళ్లు ఆయ‌న‌కు దూరంగా ఉన్నారు. కొంద‌రు టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి కార‌ణంగా అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగా, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మ‌రో విధంగా చంద్ర‌బాబు ఉండ‌డ‌మేన‌ని చాలా మంది భావిస్తుంటారు. సో..ఇప్పుడు చంద్ర‌బాబును మంచి లీడ‌ర్ అందామా? విజ‌న‌రీగా గుర్తిద్దామా? అడ్మిస్టేట‌ర్ గా కితాబు ఇద్దామా? సీఈవో గా భావిద్దామా?..ఎలా అనుకుందాం..చెప్పండి.!