Amaravati Protest : అమ‌రావ‌తి ఉద్య‌మం@800 డేస్

అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం 800వ రోజుకు చేరింది. ఆ సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు, లోకేష్ రైతుల‌కు సంపూర్ణ మ‌ద్ధ‌తును ప్ర‌క‌టించారు.

  • Written By:
  • Publish Date - February 24, 2022 / 03:46 PM IST

అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం 800వ రోజుకు చేరింది. ఆ సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు, లోకేష్ రైతుల‌కు సంపూర్ణ మ‌ద్ధ‌తును ప్ర‌క‌టించారు. రెండున్న‌రేళ్ల‌కు పైగా అమ‌రావ‌తి రైతులు జ‌గ‌న్ స‌ర్కార్ పై పోరాటం చేస్తున్నారు. ఒక వైపు న్యాయం పోరాటం ఇంకో వైపు ప్ర‌జా పోరాటాన్ని నిర్విరామంగా చేస్తున్నారు. రాజ‌ధాని కోసం సుమారు 33వేల ఎక‌రాల భూమిని సీఆర్డీయేకు అక్క‌డి రైతులు ఇచ్చారు. అందుకుగాను, ఎక‌రాకు కొంత భాగం వాణిజ్య‌, ఇళ్ల స్థ‌లాల‌ను రైతుల‌కు ఇచ్చేలా ఒప్పందం జ‌రిగింది. అంతేకాదు, ఐదేళ్ల పాటు ఎక‌రానికి రూ. 50వేల చొప్పున కౌలు ప్ర‌భుత్వం నుంచి అందుతోంది. కానీ, రాజ‌ధాని ప్రాజెక్టు మాత్రం కుప్ప‌కూలింది. సీఆర్డీయేను జ‌గ‌న్ స‌ర్కార్ ర‌ద్దు చేసింది. మూడు రాజ‌ధానుల దిశ‌గా వెళుతోంది.అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి అలుపెర‌గ‌ని పోరాటం రాజ‌ధాని కోసం చేస్తోంది. అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధానిగా ఏపీకి ఉండాల‌ని డిమాండ్ చేస్తోంది. రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిష‌న్ వేశారు. దానిపై విచార‌ణ‌లు తుది ద‌శ‌కు చేరుకున్న క్ర‌మంలో మూడు రాజ‌ధానుల బిల్లును ఏపీ స‌ర్కార్ ర‌ద్దు చేసింది. తిరిగి ఆ బిల్లును స‌మ‌గ్రంగా తీసుకొస్తామ‌ని జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌క‌టించాడు. దీంతో రైతుల ఆందోళ‌న ఇంకా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల న్యాయ స్థానం టూ దేవ‌స్థానం అంటూ ఉద్య‌మాన్ని అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టారు. అనూహ్య స్పంద‌న ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చింద‌ని స‌మితి విశ్వ‌సిస్తోంది.

అమ‌రాతి రాజ‌ధాని ఒక సామాజిక వ‌ర్గానికి సంబంధించిన ప్రాంత‌మ‌ని తొలుత జ‌గ‌న్ స‌ర్కార్ ఫోక‌స్ చేసింది. ఆ త‌రువాత ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని ప్ర‌చారం చేసింది. ఆ రెండు వాద‌న‌ల‌కు స‌రైన ఆధారాలు లేక‌పోవ‌డంతో స‌మ‌గ్ర అభివృద్ధి కోసం మూడు రాజ‌ధానులు అంటూ జ‌గ‌న్ స‌ర్కార్ చెబుతోంది. రాబోవు రోజుల్లో ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉండాలంటే మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది. ఆ మేర‌కు స‌మ‌గ్ర బిల్లును త‌యారు చేయ‌డంలో జ‌గ‌న్ సర్కార్ నిమ‌గ్నం అయింది.రాజ‌ధాని ప్రాంతాన్ని అమ‌రావ‌తిగా ఆనాడు చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్థారించింది. అసెంబ్లీలో అందుకు సంబంధించిన బిల్లుకు ఏక‌గ్రీవంగా ఆమోదం ల‌భించింది. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉంటుంద‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చాడు. తాడేప‌ల్లి వ‌ద్ద ఇళ్లు క‌ట్టుకున్న విష‌యాన్ని కూడా చెప్పాడు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని ఆనాడు అసెంబ్లీలో జ‌గ‌న్ అన్నాడు. ఆ మేర‌కు రాజ‌ధాని ప్రాజెక్టు సింగపూర్ తో క‌లిసి నిర్మాణానికి చంద్ర‌బాబు వ్యూహాన్ని ర‌చించాడు. ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌ను, డిజైన్లు పూర్తి చేశాడు. అమరావ‌తి శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజ‌రు అయ్యాడు. పండుగ‌లాగా ఆ శంకుస్థాప‌న జ‌రిగింది. కానీ, ప‌నుల‌ను మాత్రం వేగ‌వంతంగా చంద్ర‌బాబు చేయ‌లేక‌పోయాడు. తాత్కాలిక రాజ‌ధాని అంటూ కొన్ని భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం ద్వారా పాల‌న సాగించాడు. క‌నీసం రాజ‌ధానికి సంబంధించిన గెజిట్ ను కూడా ఆనాడు చంద్ర‌బాబు తీసుకురాలేక‌పోయాడు.

రాజ‌ధాని ప్రాజెక్టును చూపించి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని చంద్ర‌బాబు భావించాడు. కానీ, ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న్ను ఘోరంగా తిర‌స్క‌రించారు. అమరావ‌తి గ్రాఫిక్స్ ను ప్ర‌జ‌లు న‌మ్మ‌లేదు. కొంద‌రికి మాత్ర‌మే ల‌బ్ది చేకూర్చ‌డానికి చంద్ర‌బాబు ప్లాన్ చేశాడ‌ని ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు అనుమానించారు. అంద‌రి రాజ‌ధానిగా అమరావ‌తిని ఫోక‌స్ చేయ‌డంలో ఆనాడు బాబు వైఫ‌ల్యం చెందాడు. అందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలే. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాజెక్టును స్మ‌శానంగా మార్చేశాడు. ల‌క్ష కోట్ల విలువైన ప్రాజెక్టు ను ఒక బిల్లుతో కుప్ప కూల్చాడు. భూములు ఇచ్చిన రైతుల‌ను రోడ్డున ప‌డేశాడు. వాళ్ల‌కు ఇప్ప‌టికీ కౌలు ఇస్తున్న‌ప్ప‌టికీ సీఆర్డేయే ఒప్పందం ప్ర‌కారం ప్లాట్ల‌ను కేటాయించ‌లేదు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి ప‌ర‌చ‌డానికి ఏ మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్ ముందు రాలేక‌పోతోంది. అందుకే రైతులు ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. లక్షల కోట్ల సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని ఆపిన సీఎం జగన్‌ను చరిత్ర ఎప్పటికీ క్షమించదని చంద్రబాబు అన్నారు. నిధుల కోసం అమరావతి భూములను వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని విమర్శించారు.ఈ పోరాటంలో రైతులు విజయం సాధిస్తారని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు 24 గంటల సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రజా దీక్ష రేపు ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. రాజధాని పరిధిలోని వెలగపూడిలో చేపట్టిన దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, అమరావతి భూములను ప్రభుత్వం విక్రయిస్తే సహించేది లేదని రైతులు, మహిళలు హెచ్చరించారు. మూడు రాజధానుల‌ చర్చలను నిలిపివేయాలని, అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే మూడు రాజ‌ధానుల స‌మ‌గ్ర బిల్లు పెట్టాల‌ని భావిస్తోన్న జ‌గ‌న్ స‌ర్కార్ కు 800 రోజుల కు చేరిన ఉద్య‌మ వేదిక నుంచి రైతులు వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.