TDP : రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది : చంద్రబాబు

  • Written By:
  • Updated On - January 28, 2024 / 09:17 AM IST

ఉర‌వ‌కొండ‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌కు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జలు హాజ‌రైయ్యారు. ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఇదంతా నా పూర్వజన్మ సుక్రుతమని భావిస్తున్నానని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఉరవకొండ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోందన్నారు. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టాడని.. ఆ సభకు, ఈ సభకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలేన‌ని.. జగన్ సభలకు స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. జనంలోని చైతన్యాన్ని బట్టి ఈ విషయం స్పష్టమౌతోందని.. జ‌నం ఉత్సాహాన్ని జగన్ చూశాడంటే ఆయనకు నిద్ర పట్టదని ఎద్దేశా చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ కు 74 రోజులు నిద్ర కరువయ్యేది ఖాయమ‌ని.. ఎక్కడ చూసినా జగన్ ను జనం ఛీ కొడుతున్నారన్నారు. ‘‘నువ్వు మాకు వద్దు’’ అంటున్నారని.. జగనే ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నాడ‌న్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14కి 14 నియోజకవర్గాలు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామ‌ని.. ఇటీవలే జగన్ తన ఓటమిని అంగీకరించాడ‌ని చంద్ర‌బాబు తెలిపారు. జగన్ కు తాను ఓడిపోతున్నట్లు అర్థమైపోయింది. ఆయన ఓడిపోతున్నాడని సర్వేలు సైతం వచ్చాయన్నారు. జగన్ కు ఉన్న గర్వమంతా ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయిందని.. 2021లో ఎవరూ కూడా నా వెంట్రుక పీకలేడన్నాడని.. అప్పుడు మనిషిలో అహంభావం పూర్తిగా ఉండేదన్నారు. 2022లో ప్లీస్ నన్ను నమ్మండని బ్రతిమిలాడుకున్నాడని… 2023లో నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నేను మిమ్మల్నే నమ్ముకున్నానని అన్నాడు. 2024లో నేను హ్యాపీగా దిగిపోతా అంటున్నాడు. ఖేల్ ఖతమ్ అని జగనే ధృవీకరించుకున్నాడని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

Also Read:  CM Jagan: ప్రతిపక్షాల ‘పద్మవ్యూహం’లో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుడిని కాదు : సీఎం జగన్

ఎక్కడ పోయినా జనం ఉత్సాహం, అభిమానం చూపిస్తున్నారు. వైసీపిని భూస్థాపితం చేయాలి. డీఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఇంకా ఎవరిని మోసం చేస్తారు? మేం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలిచ్చా. మద్యం షాపులతో మంది ప్రాణాలు తీస్తున్నాడు. టీడీపీకి, వైసీపీకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించాలని చంద్ర‌బాబు కోరారు. తాము విద్యకు ప్రాధాన్యత ఇచ్చామ‌ని.. సెంట్రల్ యూనివర్శిటీలు తెచ్చామ‌న్నారు. అనంతపురంలో కియా మోటార్ పరిశ్రమ పెట్టి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేశామ‌ని.. ఇక్కడ తయారైన కార్లు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాయన్నారు. తాము రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చామ‌ని తెలిపారు వీట‌న్నింటిని జగన్ రెడ్డి తరిమేశాడ‌ని ఆరోపించారు. యువతకు జాబులు లేకుండా చేశార‌ని.. జాబు రావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే సైకిలెక్కండి. టీడీపీ-జనసేన జెండా పట్టండి అని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వ‌స్తే మీ జీవితాల్లో వెలుగు తెస్తాం. మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాను. మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే నేను సిద్ధం మీరు పది అడుగులు ముందుకు వేయండి, మీ కోసం నేను వంద అడుగులు ముందుకు వేస్తాన‌ని చంద్ర‌బాబు తెలిపారు.