CBN : దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా?

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 08:17 AM IST

ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాల‌న్నారు.  వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలు, రైతులు, రైతు కూలీలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎవ‌ర్వూ ఆనందంగా లేరన్నారు. దీనికి కారణం వైసీపీ విద్వంస పాల‌నేన‌న్నారు. రా..కదలిరా అనేది త‌న‌ కోసం కాదని.. దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ కోసమ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఈ పాలనలో ఆక్వా రైతు కుదేలయ్యాడని.. ధాన్యం రైతు దగా పడ్డాడని తెలిపారు. కానీ గంజాయి పండించిన రైతులు బాగున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మండపేటలో సైతం గంజాయి అమ్ముతున్నారని.. గంజాయి బారిన పడి యువత నిర్వీర్యమైపోతోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దళితులకు ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని.. దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీనేన‌న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి 12 జీవోలు తెచ్చి దళితులకు న్యాయం చేశామ‌ని.. అంటరానితనం, రెండు గ్లాసుల విధానం రద్దు చేసింది టీడీపీనేన‌న్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నపుడే అంబేద్కర్ కి భారతరత్న వచ్చిందని.. జీఎంసీ బాలయోగిని లోక్ సభ స్పీకర్, ప్రతిభా భారతి అసెంబ్లీ స్పీకర్ గా, కాకిమాధవరావుని సీఎస్ గా చేశామ‌ని గుర్తు చేశారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తే జగన్ రెడ్డికి వారికి ద్రోహం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో 6 వేలకు పైగా దళితులపై దాడులు జరిగాయని.. 188 మంది హత్యకు గురయ్యారని తెలిపారు. మాస్క్ అడిగిన పాపానికి డా.సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపారని.. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడని గుర్తు చేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగిస్తారా? అని ప్ర‌శ్నించారు. ఇన్ని ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా? అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదన్నారు. రాష్ట్రానికి స్వర్ణ యుగం రావాలంటే ప్రజలంతా టీడీపీ, జనసేనను గెలిపించాలని.. అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

Also Read:  Ayodhya Parking: అయోధ్య‌కు సొంత వాహ‌నంలో వెళ్తున్నారా..? అయితే మీ వాహ‌నాన్ని ఎక్క‌డ పార్కింగ్ చేయాలో తెలుసుకోండి..?