TDP : రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తా.. టీడీపీతోనే స్వర్ణయుగం – టీడీపీ అధినేత చంద్ర‌బాబు

జగన్ తీసుకొచ్చిన రాతియుగం కావాలో.. టీడీపీతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:19 AM IST

జగన్ తీసుకొచ్చిన రాతియుగం కావాలో.. టీడీపీతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ – జనసేన ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలన్నారు. నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలో నిర్వహించిన రా..కదలిరా సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా.. బ్రిటిష్ వారి గుండెలో రైల్లు పరుగెత్తించిన ఉయ్యలవాడ నరసింహరెడ్డి, ఆర్దిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహరావు వంటి మహనీయులు పుట్టిన గడ్డ క‌ర్నూల్ జిల్లా అని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనవరి 9న అని.. తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన ఈ రోజు పండుగ రోజుని తెలిపారు. ఈ సభకు వచ్చిన జనసునామీని చూసి తాడేపల్లి పిల్లి వణికిపోతోందని ఎద్దేశా చేశారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ లో 7 అసెంబ్లీ స్ధానాలు గెలుస్తామ‌ని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలన పేదలకు శాపంగా మారిందని.. పేద వారు నిరుపేదలుగా యువత నిరుద్యోగులు మిగిలిపోయారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

త‌న‌కు అధికారం కొత్త కాదని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి.. 47 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని తెలిపారు. త‌న‌ తపనంతా తెలుగుజాతి అభివృద్ది కోసమేన‌ని ఆయ‌న తెలిపారు. రాక్షసులకు అధికారం ఇవ్వటం వల్లే నేడు రాష్ట్రానికి ఈ పరిస్ధితి వ‌చ్చింద‌న్నారు. తనకు వరమిచ్చిన వారినే నాశనం చేయాలనుకున్న భష్మాసురుడు చందంగా జగన్ రెడ్డి తయారయ్యాడని మండిప‌డ్డారు. ముద్దులు పెట్టి మీ నెత్తిమీద చెయ్యి పెడితే మురిసిపోయి ఓట్లేశారని.. నేడు కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఈ సైకో రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశాడని.. రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు తప్ప జగన్ కి ఏమీ తెలియవన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టార‌ని.. ఒక్కసారి కదా అని కరెంట్ వైర్ పట్టుకుంటే షాక్ కొడుతుందని నాడే చెస్తే త‌న మాట ఎవ‌రూ వినలేదన్నారు.

Also Read:  TDP : క‌ర్నూల్ జిల్లా మంత్రాల‌యంలో నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు ఆర్థిక‌సాయం

కర్నూలు జిల్లాలో టీడీపీ హయాంలో రూ. 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ కి శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. అది వస్తే మొక్కల పెంపకం, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటివి వచ్చేవని.. దాన్ని నిర్వీర్యం చేశార‌న్నారు. నందికొట్కూరులో రూ. 650 కోట్లతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు కృషి చేశామ‌ని.. అది వచ్చి ఉంటే ప్రపంచం మొత్తానికి విత్తన సరఫరా కేంద్రంగా నంద్యాల ఉండేదన్నారు. దాన్నీకూడా వైసీపీ ప్ర‌భుత్వం నాశనం చేశారన్నారు. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ కి శంకుస్ధాపన చేస్తే దాన్ని నిలిపేశారన్నారు. ఓర్వకల్లులో 15 నెలల్లోనే ఎయిర్ పోర్ట్ నిర్మించిన ఘనత టీడీపీదేన‌న్నారు. ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటు చేశామ‌ని.. తాను ఉంటే కర్నూలు జిల్లా పారిశ్రామిక హబ్ గా తయారయ్యేదని తెలిపారు. అధికారంలోకి వ‌చ్చాక సీమ‌లోని పెండింగ్ ప్రాజెక్టుల్నీ పూర్తి చేసి రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని చంద్ర‌బాబు హ‌మీ ఇచ్చారు.