Site icon HashtagU Telugu

CBN : ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్బాగ్యం : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

TDP

TDP

తుఫాన్ తో పంట నష్టపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరులో మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన పంటపొలాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. తెనాలి నియోజకవర్గంలో వరి, అరటి, మినుము, పెసలు వంటి పంటలు దెబ్బతిన్నాయని.. 30 వేల ఎకరాల్లో 80 శాతం పంట నష్టం జరిగిందని చంద్ర‌బాబు తెలిపారు. వేమూరు నియోజకవర్గంలో 90 వేల ఎకరాల్లో పంట సాగుచేస్తే 90 శాతం పంట నష్టం జ‌రిగింద‌ని.. వరి అంతా నేలకొరగ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌న్నారు. ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు చేసి.. ప్రతి రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి భూమ్మీద తిరగకుండా ఆకాశంలో తిరుగుతున్నారని.. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. టీడీపీ హయాంలో ఎప్పటికప్పుడు పంటకాలువల్లో పూడిక తీశామని.. కానీ నేడు ఎక్కడైనా పంటకాలువల్లో పూడిక తీసిన సంద‌ర్భం లేద‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ రెడ్డికి బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియదని.. పొటాటో అంటే ఏంటని రైతుల్ని అడుగుతున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? అని ప్ర‌శ్నించారు. జగన్ రెడ్డికి తప్పుడు పనులు చేయటం తప్ప ఇంకేం తెలియదన్నారు. రేపల్లెలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేస్తే 60 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని.. బాపట్లలో 45 వేల ఎకరాలు సాగు చేస్తే 45 వేల ఎకరాలు నష్టపోయిందన్నారు. ఒక్క ఈ ప్రాంతంలోనే ఇన్ని వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటే ఇక రాష్ట్రం మొత్తం ల‌క్ష‌ల ఏక‌రాల్లో పంట‌న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌న్నారు. హుద్‌హుద్‌ తుఫాన్ సమయంలో తుఫాన్ కంటే ముందుగా తానే విశాఖ వెళ్లి అక్కడి ఉండి పరిస్ధితులు చక్కదిద్దాన‌న్నారు. వైసీపీ మంత్రులు సాధికార యాత్ర అంటూ తిరుగుతున్నారని.. వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప కూడా దాట లేదన్నారు.

Also Read:  Chandrababu Naidu: టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు నష్టపరిహారం ఇస్తాం: చంద్రబాబు నాయుడు