Site icon HashtagU Telugu

Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి

Chiranjeevi

Chiranjeevi

Ayodhya : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్‌  ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.మధ్యాహ్నం జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.  మెగా ఫ్యామిలీ అయోధ్య పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. వాటిలో ఒకటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫొటోలో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు అనిల్ అంబానీతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కనిపించారు. ఆ ఫొటోలో వారితో పాటు రామ్ చరణ్ కూడా కనిపించారు. ఈ ముగ్గురూ కలిసి కాసేపు మాట్లాడుకున్నారు.

అయోధ్యలో(Ayodhya) జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శ్రీరామజన్మభూమి తీర్థక్షత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ప్రాంగణంలో అమర్చిన వీఐపీ గ్యాలరీలో తొలి వరుసలో చంద్రబాబు కూర్చున్నారు. అప్పటికే అక్కడికి చేరిన ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ పక్కనే చంద్రబాబు ఆసీనులయ్యారు. సోమ్‌నాథ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం కొందరు రాజకీయ ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.

Also Read: Ayodhya Darshan : రామమందిర దర్శనం టైమింగ్స్‌, పూజలు, డ్రెస్ కోడ్ వివరాలివీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అయోధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్‌ చరణ్ ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. మెగాస్టార్ కుటుంబం ఈ తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి బయలుదేరి రాగా.. పవన్ కల్యాణ్ ఆదివారం సాయంత్రమే అయోధ్యకు వచ్చేశారు.

ఈ వేడుక ఆరంభానికి ముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భారతీయ నాగరికతకు రామచంద్ర ప్రభువు మూల కారకుడు. అయోధ్యకు రాముడిని తీసుకు రావడానికి 500 సంవత్సరాుల పట్టింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతీ భారతీయుడి కల. ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా, భావోద్వేగంగా ఉంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

 

రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్‌ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది.  ఆ దివ్యరూపం సోషల్‌ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు.

దర్శన వేళలు ఇవే

అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్‌లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం​. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు.