Site icon HashtagU Telugu

Chandrababu Plan : ‘వ్యూహాన్ని’ మార్చేసిన చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు వ్యూహాల‌ను మార్చుతున్నాడు. గ‌త రెండేళ్లుగా అలుపెర‌గ‌ని పోరు వైసీపీపై చేస్తోన్న‌ప్ప‌టికీ ఆశించిన ఫలితాల‌ను సాధించ‌లేద‌నే అభిప్రాయం ఆయ‌న‌కు ఉంది. ఆ మేర‌కు టీడీపీ శ్రేణులు కూడా అప్పుడ‌ప్పుడు అసంతృప్తిని వ్య‌క్తప‌రిచారు. సీనియ‌ర్ లీడ‌ర్ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, గంటా శ్రీనివాసరావు, అచ్చెంనాయుడు, కేశినేని నాని, జేసీ బ్ర‌ద‌ర్స్ త‌దిత‌రులు ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా పార్టీ ప‌నితీరును విమ‌ర్శించారు. టీ క‌ప్పులో తుఫాన్ మాదిరిగా ఆ అసంతృప్తి స‌ద్దుమ‌ణిగిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం పార్టీలోని అంశాల‌పై లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నాడు. అందుకే, ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న రాబిన్ సింగ్ ను మార్చేశాడు.రెండేళ్ల క్రితం రాబిన్ సింగ్ తెలుగుదేశం పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా చేరాడు. ఆ రోజు నుంచి పార్టీ అనుస‌రిస్తోన్న వ్యూహాలు పెద్ద‌గా ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ రెండేళ్ల పాటు ఆయ‌న్న భ‌రించారు. స్థానిక సంస్థ‌ల తొలి విడ‌త ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండే నిర్ణ‌యం పార్టీ చాలా న‌ష్టం క‌లిగించింది. అంతేకాదు, కుప్పంతో పాటు రెండో విడ‌త జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ పాల్గొంది. ఆ నిర్ణ‌యం కూడా చాలా న‌ష్టాన్ని పార్టీకి క‌లిగించింది. వివిధ కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చేసిన ప్ర‌సంగం వెనుక రాబిన్ సింగ్ స‌ల‌హా ఉంద‌ట‌. ప్ర‌త్యేకించి గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అమ‌రావ‌తి ఎజెండాను తీసుకోవ‌డం పెద్ద త‌ప్పు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోనూ తెలుగుదేశం పార్టీకి ఆశించిన మైలేజ్ ల‌భించ‌లేదు.

ఇటీవ‌ల అసెంబ్లీ వేదిక‌గా భువ‌నేశ్వ‌రి శీలంపై చేసిన కామెంట్ల‌ను హైలెట్ చేయ‌డం ద్వారా కూడా ఆశించిన సానుభూతి ల‌భించ‌లేదు. దేవాల‌యాల్లో విగ్ర‌హాల ధ్వ‌సం, మ‌తం ప్రాతిప‌దిక‌న చేసిన కొన్ని కార్య‌క్ర‌మాలు కూడా మైలేజ్ ను తీసుకురాలేదు. చ‌లో విజ‌య‌వాడ సంద‌ర్భంగా ఉద్యోగులు చేసిన ధ‌ర్నా త‌ర‌హాలో తెలుగుదేశం పార్టీ చేసిన వివిధ కార్య‌క్ర‌మాల‌కు స్పంద‌న క‌నిపించ‌లేదు. రెండేళ్లుగా రాబిన్ సింగ్ డైరెక్ష‌న్లో టీడీపీ న‌డుస్తోంది. ఆయ‌న ప్ర‌శాంత్ కిషోర్ శిష్యుడు. ఐప్యాక్ స‌ర్వే సంస్థ‌ల్లో ప‌నిచేసిన అనుభ‌వం రాబిన్ సింగ్ కు ఉంది. బీహార్ త‌ర‌హా పాలిటిక్స్ వ్యూహాల‌ను పీకే, ఆయ‌న శిష్యుడు రాబిన్ ర‌చిస్తుంటారు.ఏపీ ఓట‌ర్ల మైండ్ సెట్ వేరు. సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఉంటుంది. వాట‌న్నింటిపైన అధ్య‌య‌నం చేసిన రాబిన్ స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా స‌ల‌హాలు ఇవ్వ‌లేద‌ని చంద్ర‌బాబు భావించాడు. అందుకే ఆయ‌న స్థానంలో కొత్తగా చేబ్రోల్ కానుగోలు కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాడు. గ‌త ఎన్నిక‌ల్లో పూర్తిగా పీకే ఆధ్వ‌ర్యంలోనే జ‌గ‌న్ పార్టీ న‌డిచింది. అభ్య‌ర్థుల ఖ‌రారు కూడా పీకే ఇచ్చిన స‌ర్వేల ఆధారంగా జ‌గ‌న్ వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్రభుత్వం ప‌నితీరు, లోపాల‌ను స‌రిచేసే ప‌నిలో పీకే టీం ఉంద‌ని తెలుస్తోంది. ఆయ‌న శిష్యుడు రాబిన్ టీడీపీకి ఇచ్చిన వ్యూహాల‌ను ఆశించిన ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేదు. పైగా కీల‌క‌మైన తిరుప‌తి లోక్ స‌భ‌, బ‌ద్వేల్ ఉప ఎన్నిక, కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ సంద‌ర్భంగా రాంగ్ డైరెక్ష‌న్లో పార్టీ ని తీసుకెళ్లాడ‌ని బాబు భావిస్తున్నాడ‌ని వినికిడి. అందుకే, ఇక నుంచి పార్టీ వ్యూహాల‌ను ర‌చించ‌డానికి కానుగోలు ను నియ‌మించాడు. సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ కానుగోలు స‌ర్వేలు చేస్తుంటారు. ఇటీవ‌ల కొన్ని స‌ర్వేల‌ను చేయించిన సునీల్ చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌య్యాడు. రాబోవు ఎన్నిక‌ల్లో వ్యూహాల‌ను ర‌చించే బాధ్య‌త‌ను సునీల్ అండ్ టీంకు చంద్ర‌బాబు అప్ప‌గించాడు. ఆయ‌న స‌ర్వేల ప‌నితీరు బాగుంటే ఎన్నిక‌ల వ‌ర‌కు సునీల్ సేవ‌ల‌ను చంద్ర‌బాబు వినియోగించుకో నున్నాడు. రాబిన్ సింగ్‌కు మాత్రం చంద్ర‌బాబు ఉద్వాస‌న ప‌లికాడు.

Exit mobile version