వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) తాజాగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడి(Chandrababu)పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వేరొక వ్యక్తి రాజకీయంగా ఎదుగుతుంటే సహించలేకపోతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ(vallabhaneni Vamsi ) పై పాత కేసులను తిరిగి తెరపైకి తెచ్చి ఆయనను రాజకీయంగా బలహీన పరచాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు.
Allu Arjun – Atlee Movie : అల్లు అర్జున్ కు జోడిగా దేవర బ్యూటీ..?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ముఖ్యంగా వంశీని టార్గెట్ చేసేందుకు టీడీపీ నేతలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. పట్టాభి వంశీని రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, ఆ కారణంగానే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయంలో వంశీ పేరును టీడీపీ ఫిర్యాదులో పొందుపరచలేదని, కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆయనపై చట్ట వ్యతిరేకంగా కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ నేతలు తమ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక కుటుంబం మాత్రమే నాయకత్వం వహించాలని చూస్తున్నారని, ఇతరులు ఎదిగితే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే వంశీని టార్గెట్ చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని జగన్ అభిప్రాయపడ్డారు.
ఇదే క్రమంలో పోలీసులపై కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కొంత మంది పోలీసులు అధికార కూటమికి సహకరించి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఉన్న గుర్తులు, చిహ్నాలకు మాత్రమే గౌరవం ఇవ్వాలని, కానీ వారు రాజకీయ ఒత్తిడికి లోనై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ముందు ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని జగన్ అన్నారు. అక్రమ కేసుల వల్ల చివరికి బాధితులుగా మారేది వారే అవుతారని, వైసీపీ తన నేతలను బలహీనపరచాలని చూసే ప్రతి ప్రయత్నాన్ని ధీటుగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.