ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి భవిష్యత్తు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఉగాది (Ugadi) సందర్భంగా ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం(Ugadi Awards Ceremony)లో పాల్గొన్న ఆయన, గత ఐదేళ్లలో రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నదని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ అగ్రస్థానంలో నిలవాలని, తెలుగువారు ఆ నాయకత్వ భాద్యతను తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పోటీ ప్రపంచంలో హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ అవసరమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన విధానం, టెక్నాలజీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత గురించి వివరించారు. నూతన ఆవిష్కరణలు మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పాలనను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభతర సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ విధంగా కొత్త విధానాలను ప్రవేశపెట్టి, ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Drought : రాష్ట్రంలోని 51 మండలాల్లో కరవు
అంతేగాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టమైనప్పటికీ, రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చంద్రబాబు నాయుడు వివరించారు. ఉన్నత స్థాయికి చేరుకున్న వారు తిరిగి సమాజానికి సహాయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ‘జీరో పావర్టీ’ లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ స్థానంలో నిలవడానికి కేవలం 25 ఏళ్ల సమయం మాత్రమే అవసరమని, ఈ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.