Site icon HashtagU Telugu

Draupadi Murmu : రాష్ట్ర‌ప‌తి ఏపీ షెడ్యూల్‌! బాబు, జ‌గ‌న్ ఢిల్లీ వైపు.!

Jagan Babu Murmu

Jagan Babu Murmu

రాష్ట్ర‌ప‌తి ముర్ము ఏపీకి వ‌స్తోన్న వేళ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు ప్లాన్ ఏమిటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ఈనెల 5వ తేదీన ఢిల్లీ వెళ‌తార‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కార్యాల‌యం నుంచి అందిన ఆహ్వానం మేర‌కు వెళ‌తార‌ని తెలుస్తోంది. జీ20కి ఆతిథ్యం ఇస్తోన్న భార‌త్ త‌ర‌పున ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించ‌డానికి అనువుగా దేశంలోని రాజ‌కీయ పార్టీల చీఫ్ ల‌ను మోడీ ఆహ్వానించారు. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబు ఈనెల 5న ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అదే స‌మావేశానికి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా హాజ‌రు కానున్నారు. అయితే, రాష్ట్ర‌ప‌తికి ఏపీ ప్ర‌భుత్వం పౌర‌స‌న్మాన్ని కూడా ఇదే తేదీల్లో ఏర్పాటు చేసింది.

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ చేసిన సంద‌ర్భంలో మ‌ద్ధ‌తు కోసం ముర్ము ఏపీకి వ‌చ్చారు. అధికారంలోకి వైసీపీతో స‌మావేశం అయిన ఆమె అనూహ్యంగా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు, ఎమ్మెల్యేల‌తో భేటీ అయ్యారు. హోం మంత్రి అమిత్ షా సూచ‌న మేర‌కు ఆనాడు టీడీపీతో ఆమె స‌మావేశం అయ్యార‌ని వినిపించింది. ఇప్పుడు పౌర‌స‌న్మానం కోసం వ‌స్తోన్న ముర్ము ప‌ర్య‌ట‌న టీడీపీ, వైసీపీ మ‌ధ్య రాజ‌కీయాన్ని మ‌రింత హీటెక్కించేలా ఉంది.

రాష్ట్రపతి హోదాలో తొలి సారి ఏపీకి వస్తున్న ముర్ము ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు అయింది. అందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల ఏపీ పర్యటన కోసం 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఆమె ఢిల్లీలో బయలుదేరి ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి హజరవుతారు. ఏపీ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్ రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్మును సన్మానిస్తారు. అనంతరం గౌరవార్థం గవర్నర్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. సాయంత్రం విశాఖలో జరిగే నేవీడే ఉత్సవాలకు.. రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా ముఖ్య అతిథిగా హాజరై, విన్యాసాలను తిలకిస్తారు.

విశాఖ వేదికగా రాష్ట్రంలో రక్షణ- జాతీయ రహదారులు, కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏయిర్ రేంజ్ వ‌ర్చువ‌ల్ గా ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ స్వగ్రామం క్రిష్ణా జిల్లా నిమ్మకూరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తారు. రాష్ట్రపతి ప్రారంభించే వాటిలో రాయచోటి – అంగల్లు జాతీయ రహదారి సెక్షన్ తో పాటుగా కర్నూలు నగరంలో ఆరు లేన్లుగా విస్తరించిన రోడ్లు ఉన్నాయి. మదిగుబ్బ- పుట్టపర్తి హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీట‌న్నింటిపైన‌ ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.

విశాఖ లో కార్యక్రమాలు పూర్తయిన తరువాత అక్కడి నుంచి అదే రోజు రాత్రికి తిరుపతి చేరుకుంటారు. మ‌రుస‌టి రోజు(5వ తేదీ) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో భేటీ అవుతారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం బయలుదేరి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. ఇక, అదే రోజున సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. జీ20 నాయకత్వ అంశం పైన రాష్ట్రపతి భవన్ లో ప్రదాని మోదీ అధ్యక్షతన జరిగే అన్ని పార్టీల సమావేశానికి సీఎం హాజరవుతారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అదే సమావేశంలో పాల్గొననున్నారు. అయితే, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా హాజ‌రు అవుతారా? ప్ర‌భుత్వం ఆహ్వానిస్తుందా? లేదా? అనేది సందిగ్ధం.