Babu & Lokesh: మేము ఉన్నాం..మేము వింటాం!

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు విడ‌త‌వారీగా జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా `బాదుడే బాదుడు` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల‌ను చేస్తోంది.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 03:29 PM IST

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు విడ‌త‌వారీగా జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా `బాదుడే బాదుడు` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల‌ను చేస్తోంది. ఆ కార్య‌క్ర‌మం కొన్ని జిల్లాల్లో మంద‌కొడిగా సాగుతోంది. అంతేకాదు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని గ్రూప్ విభేదాల కార‌ణంగా ఆశించిన విధంగా క్యాడ‌ర్ ముందుకు క‌ద‌ల‌డంలేదు. ఆ మేర‌కు కార్య‌క్ర‌మాల క‌మిటీ నివేదిక‌ను అందుకున్న చంద్ర‌బాబు ఆయా జిల్లాల్లో తొలి విడ‌త ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు.

ఈనెల 6వ తేదీ వ‌ర‌కు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ను టీడీపీ ప్ర‌క‌టించింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు తొలి ప‌ర్య‌ట‌న ఉంటుంది. ఈనె 5న భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో, 6న ముమ్మడివరం నియోజకవర్గం కోరింగ గ్రామంలో జ‌రిగే `బాదుడే బాదుడు` కార్యక్రమాల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం దుల్లవలస గ్రామంలో పర్యటనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ నియోజకవర్గ ఇన్ ఛార్జి, జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం 4గంటల నుండి 6గంటల వరకు గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చంద్రబాబు వివరించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు గ్రామ సభలో పాల్గొని ప్రజలతో మాట్లాడుతారు. అనంతరం గ్రామంలోని బడుగు, బలహీన వర్గాలతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు.

పొందూరు మండలంలోని దళ్ళవలసలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లను అధికారులు బుధవారం పరిశీలించారు. గ్రామంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్న ‘ బాదుడే బాదుడు ‘ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం టిడిపి అధ్యక్షుడు కూన రవికుమార్ పాల్గొన్నారు. ఎంపిక చేసిన అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించాల‌ని షెడ్యూల్ చేశారు. మ‌హానాడు వ‌ర‌కు ఇలాగే కార్య‌క్ర‌మాలను కొన‌సాగిస్తారు. ఆ త‌రువాత ఏక‌బిగిన బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌డానికి సిద్ధం అవుతున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ సిద్ధం అయింద‌ని తెలుస్తోంది.

మ‌హానాడును ఈసారి కేవ‌లం ఒక రోజు మాత్రం నిర్వ‌హించాల‌ని తాజాగా టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా మే 28న మ‌హానాడు నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ముందు రోజు పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వేదిక‌పై నుంచి లోకేష్ పాద‌యాత్ర షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డానికి టీడీపీ స‌మాయాత్తం అయింది. ఎన్టీఆర్ శత‌జ‌యంతి ఉత్స‌వాల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు వ‌చ్చే ఏడాది మే వ‌ర‌కు లోకేష్ పాద‌యాత్ర‌కు రూట్ మ్యాప్ ను త‌యారు చేయ‌నున్నారు. అలాగే, చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌ను కూడా షెడ్యూల్
చేయ‌నున్నారు. తొలుత లోకేష్ పాద‌యాత్ర ఉంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ త‌రువాత చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

బాబు బస్సు యాత్ర‌, లోకేష్ పాద‌యాత్ర రెండు ఒకేసారి ప్ర‌క‌టించాల‌ని టీడీపీ క్యాడ‌ర్ కోరుతోంది. తిరుప‌తి నుంచి చంద్ర‌బాబునాయుడు బ‌స్సు యాత్ర‌, ఇచ్ఛాపురం నుంచి లోకేష్ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుడ‌తార‌ని తెలుస్తోంది. అందుకే ముందుగా శ్రీకాకుళం నుంచి `బాదుడే బాదుడు` కార్య‌క్ర‌మాల్లో బాబు పాల్గొంటున్నార‌ని పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.