AP Politics : జ‌య‌హో బీసీ! బాబు, జ‌గ‌న్ జాత‌కాలు!!

వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఓటు బ్యాంకు మీద వైసీపీ క‌న్నేసింది. 2019 ఎన్నిక‌ల్లో ఆ వ‌ర్గం మ‌ద్ధ‌తు ఇవ్వ‌డంతో 151 స్థానాల‌ను సాధించ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 02:43 PM IST

వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఓటు బ్యాంకు మీద వైసీపీ క‌న్నేసింది. 2019 ఎన్నిక‌ల్లో ఆ వ‌ర్గం మ‌ద్ధ‌తు ఇవ్వ‌డంతో 151 స్థానాల‌ను సాధించ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది. మ‌రో ఛాన్స్ కోసం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీసీల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఈనెల 7వ తేదీన విజ‌య‌వాడ ఇందిరాప్రియ‌ద‌ర్శిని ఆడిటోరియంలో `జ‌య‌హో బీసీ` ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌రుగుతోంది. ఆ స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నుండ‌గా, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మూడేళ్లుగా ఏపీ ప్ర‌భుత్వం బీసీల‌కు ఇచ్చిన ప్రాధాన్యంపై ఫోక‌స్ పెట్ట‌నున్నారు. ఆ సామాజిక‌వ‌ర్గం కోసం 56 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధుల్ని కేటాయించ‌కుండా తాత్సారం చేయ‌డం గ‌మ‌నార్హం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే బీసీలు కీల‌క‌మ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద నున్న స‌ర్వే సారంశ‌మ‌ట‌. అందుకే, తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖగా ఉన్న బీసీల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తొలి నుంచి టీడీపీకి అండ‌గా బీసీలు ఉండే వాళ్లు. ప్ర‌ధాని మోడీ 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్లో 5శాతం కాపుల‌కు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీంతో బీసీలు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వైసీపీ వైపు మ‌ళ్లారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో మళ్లీ టీడీపీ వైపు బీసీలు, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు చూస్తున్నాయ‌ని స‌ర్వే లు చెబుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్తం అయిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీసీల ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌కు సిద్ధం అయ్యారు.

జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని బీసీ సర్చంచులు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరవుతారు. ఈ సందర్భంగా బీసీల కోసం కొన్ని నజరానాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.