Site icon HashtagU Telugu

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది – చంద్రబాబు

Babu Polavaram

Babu Polavaram

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) స్థితిగతులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశమయ్యారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం (Polavaram ) ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్న ఆయన..చెప్పినట్లు ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు చేరుకున్న చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్‌ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉందనే వివరాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని , ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. 2014-2019 మధ్య పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకుంది. డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మించకుండా మీన మేషాలు లెక్కలేశారు. మళ్లీ మొత్తం డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలంటే రూ. 997 కోట్లు కావాలి. నాలుగు చోట్ల డ్యామేజ్ అయింది. కాఫర్ డ్యామ్‌నూ నిర్లక్ష్యం చేశారు. కాఫర్ డ్యామ్ కింద ఇసుక దాదాపు 20 మీటర్ల పొడవు కొట్టుకుపోయింది. 150 మీటర్ల లోతు మేర ఇసుక వేసి ఫిల్ చేయాలి. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ పనులకు దాదాపు రూ. 2500 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే 2020కే పూర్తి అయ్యేది. ఇప్పుడు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందన్నారు.

తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనం అవడంతోనే ఆనాడు పోలవరం పనులు చేయగలిగామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే… రాజకీయాల్లో ఉండడానికే అర్హత లేని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి, రాష్ట్రానికి ఒక శాపంలా మారాడు. అందుకు పోలవరం ఒక ఉదాహరణ. ఇది ఒక కేస్ స్టడీ వంటిది. ఇలాంటివి చాలా జరిగాయి. పోలవరం విషయంలో జరిగింది తప్పు కంటే పెద్దది. చిన్న తప్పు చేశాడనుకుంటాం… కానీ క్షమించరాని నేరం ఇది. నేను దాదాపు 30 సార్లు పోలవరం సందర్శించి ఉంటాను. ఇవాళ 31వ సారి వచ్చాను. నా మనసంతా ఈ ప్రాజెక్టు మీదనే ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడేది నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

Read Also : Sidda Raghava Rao : వైసీపీలో ఊపందుకున్న రాజీనామాల పర్వం