AP MLC Polls: `సెమీ సంగ్రామం`కు బాబు సై, జ‌గ‌న్ మౌనం!

ఏపీలో సెమీ సంగ్రామానికి టీడీపీ దూకుడుగా వెళుతోంది. మ‌రో నాలుగు నెల‌ల్లో జ‌రిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు కైవ‌సం చేసుకోవ‌డానికి `ముంద‌స్తు`

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 11:33 AM IST

ఏపీలో సెమీ సంగ్రామానికి టీడీపీ దూకుడుగా వెళుతోంది. మ‌రో నాలుగు నెల‌ల్లో జ‌రిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు కైవ‌సం చేసుకోవ‌డానికి `ముంద‌స్తు` వ్యూహాన్ని చంద్ర‌బాబు ర‌చించారు. ఆ క్ర‌మంలో తాజాగా ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గాడు చిన్ని కుమారి ల‌క్ష్మీ పేరును టీడీపీ ప్ర‌క‌టించింది.

నాగవంశీయుల(బీసీ) వర్గానికి చెందిన చిన్నికుమారి లక్ష్మి 2008-10లో భీమిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. సంస్థాగ‌తంగా రాష్ట్ర తెలుగు మహిళా విభాగంలో ప‌నిచేసిన అనుభవం ఉంది. ఆమె భర్త అప్పల నాయుడు 1986నుంచి టీడీపీలో ఉన్నారు. విశాఖ జిల్లా టీడీపీలో వివిధ పదవులు నిర్వహించారు. కొన్ని ద‌శాబ్దాలు టీడీపీలోనే కొన‌సాగుతున్న కుటుంబం. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన వాళ్ల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని చెప్ప‌డానికి చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.

ప‌శ్చిమ రాయ‌ల‌సీమ స్థానానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయ‌ల‌సీమ స్థానానికి కంచ‌ర్ల శ్రీకాంత్ అభ్య‌ర్థిత్వాల‌ను చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. విశాఖ‌ప‌ట్నం స్థానానికి త్వ‌ర‌లోనే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డానికి సిద్దం క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల‌ని చంద్ర‌బాబు పిలుపునివ్వ‌డం ఆయ‌న దూకుడుకు నిద‌ర్శ‌నంగా ఉంది. ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ఓట‌ర్ల జాబితాల‌ను ప‌రిశీలించుకుంటూ ఉండాల‌న్న చంద్ర‌బాబు, ఏమాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా వైసీపీ దొంగ ఓటర్ల‌ను చేర్చుతార‌ని క్యాడ‌ర్ ను అప్ర‌మ‌త్తం చేశారు.

వాస్త‌వంగా 2023 మార్చి 29తో 6 ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. అక్టోబరు 1 నుంచి ఓటర్ల నమోదుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నవంబరు 23న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసే అవ‌కాశం ఉంది. డిసెంబరు 23న తుది ఓటర్ల జాబితా విడుదల చేయ‌డానికి ఈసీ సిద్ధం అవుతోంది.

ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబరు ఒకటో తేది నుంచి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్ర‌క్రియ ప్రారంభం అయింది. 2019 అక్టోబరు 31వ తేది నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన ప‌ట్ట‌భ‌ద్రులు ఓటరుగా నమోదుకు అర్హులు. పట్టభద్రులైతే డిగ్రీ మార్కుల జాబితా, ఉపాధ్యాయులైతే ప్రధానోపాధ్యాయుడు ఇచ్చే సర్టిఫికెట్‌ను ఓటరు నమోదు దరఖాస్తుకు జత చేయాలి. ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఫారం-18, ఉపాధ్యాయులు ఫారం-19 అందజేయాలి. ఓటర్లుగా చేరేందుకు కలెక్టరేట్‌, తహసీల్దారు కార్యాలయాల్లో, ఆన్‌లైన్‌లో లేదా బీఎల్వోల వద్ద నమోదు చేసుకోవచ్చు. వీటి స్వీకరణకు నవంబరు 7వ తేది వరకు గడువు ఉంటుంది. నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. డిసెంబరు 9వ తేది వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు.

ప్ర‌స్తుతం ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద యూత్ వ్య‌తిరేకంగా ఉంద‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. వాళ్ల‌తో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని భావిస్తోంది. పైగా ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో జ‌రిగే ఎన్నిక‌లు ఏపీ వ్యాప్తంగా ఉండే 80శాతం ప్రాంతాల నాడిని తెలుసుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న ఎన్నిక‌లు. అందుకే, చంద్ర‌బాబునాయుడు సెమీ సంగ్రామంగా ఈ ఎన్నిక‌ల‌ను భావిస్తున్నారు. ముందస్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా ఏపీ ఓట‌ర్ల మూడ్ ను సాధార‌ణ ఎన్నిక‌ల కంటే ముందుగానే బ‌య‌ట ప‌డుతుంది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్సీలు గెలుపొందితే 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన‌ట్టే ఏ పార్టీ అయినా భావించ‌డానికి అవ‌కాశం ఉంది. అందుకే, చంద్ర‌బాబు ముంద‌స్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ సామాజిక ఈక్వేష‌న్ల‌ను పాటించారు.