Polluted Water: మన్యంలో ‘మంచినీటి’ ఘోస!

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ కనీస సమస్యలు సైతం జగన్ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 02:32 PM IST

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ కనీస సమస్యలు సైతం జగన్ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. తిండి, బట్ట దేవుడెరుగు.. కానీ గుక్కెడు నీళ్లు దొరక్క గిరిజన గ్రామాలు అల్లాడుతున్నాయి. గొంతు తడుపుకోవడానికి కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్తూ పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని రంపచోడవరం మండలం, చిలక మామిడి గ్రామస్థుల తాగునీటి అవస్థలు ప్రతిఒక్కిరినీ కదిలిస్తున్నాయి. సుమారు 150 గిరిజన కుటుంబాలు నివాసముండే ఈ గ్రామంలోని వాటర్ ట్యాంక్ మోటార్లు పాడయ్యాయి. రిపేరు చేయడానికి పంచాయితీలకు నిధులు సైతం లేకపోవడం గమనార్హం.

అయితే సొంత డబ్బులు ఖర్చుపెట్టి పనులు చేయిస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చేసేది లేక ఆదివాసీ ప్రజలు కొండ వాగు చెంత చెలమ నీటినే తాగుతున్నారు. చెలమలోనీ నీరంతా కలుషితం కావడంతో దిక్కులేక గిరిజనులు ఆ నీటిననే తాగుతున్నారు. దీంతో పిల్లలు, పెద్దలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటుండటం బాధాకరం. ఇక జిల్లాలోని పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ కాలనీ వాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.  తాగునీటి కోసం కాఫీ కార్మికులు కుళాయిల వద్ద గంటలపాటు పడిగాపులు పడుతున్నారు.  అక్కడ 54 కుటుంబాలకు చెందిన 250 మంది వరకు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒకే ఒక్క ట్యాంక్‌ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి సమయంలో ట్యాంక్‌కు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కాకపోవడంతో బిందెడు నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎఫ్‌డీసీ అధికారులు స్పందించి కాఫీకాలనీలో ఉంటున్న కార్మికుల తాగునీటి కష్టాలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని మహిళలు కోరారు.

అయితే గత నాలుగైదురోజులుగా అల్లూరి సీతామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతాలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడటం, గొంతు తడుపుకోవడానికి కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటువెళ్లడం, కలుషిత నీటినే తాగడం లాంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. ‘‘నీటి సమస్య పరిష్కారానికి పంచాయతీలకు నిధులు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ఇది ముమ్మాటికీ చేతగాని ప్రభుత్వమే’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గిరిజనుల నీటి ఘోసను వర్ణిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.