Site icon HashtagU Telugu

Chalo Vijayawada:సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’

Cps Imresizer

Cps Imresizer

CPS Employees: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శాతవాహన కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహణకు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్లలో ఏదో ఒక చోట ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశంపై అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణతో బుధవారం ఉదయం సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అయితే ఆందోళన కార్యక్రమాలను విరమించుకోవాలని, ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతుందని మంత్రి బొత్స సూచించారు.

కాగా చర్చలకు రావాలని మంత్రి బొత్స పిలిస్తేనే తాము వచ్చామని ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాస్ ఎన్టీవీతో వ్యాఖ్యానించారు. పాత పెన్షన్ విధానమే కొనసాగించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఈ ఒక్క అంశం మీద మాత్రమే చర్చించామని తెలిపారు. తమ భవిష్యత్ గురించి తాము భయపడటం లేదని.. చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా బెదిరిస్తున్నారని.. ఏదేమైనా సెప్టెంబర్ 1న సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అటు పోలీస్ విభాగంలో కూడా చాలా మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నందున కచ్చితంగా తాము తలపెట్టిన కార్యక్రమానికి సహకారం లభిస్తుందని ఏపీసీపీఎస్ఈఏ ప్రజా సంబంధాల అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాకుండా సీపీఎస్ ఉద్యోగ సంఘాలకు మద్దతు ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలకు ఈసారి ఏపీసీపీఎస్ఈఏ ఎలాంటి ఆహ్వానాలు పంపడం లేదని.. వారి మద్దతు తీసుకోవాలని తాము భావించడం లేదని స్పష్టం చేశారు.

Exit mobile version