Special Status : ప్ర‌త్యేక హోదాపై లోక్ స‌భ‌లో ఎంపీల మౌనం

ప్ర‌త్యేక హోదా లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ ఏపీ ఎంపీలు లోక్ స‌భ‌లో శ్రోత‌లు మాదిరిగా ఉండిపోయారు.

  • Written By:
  • Publish Date - December 1, 2021 / 03:47 PM IST

ప్ర‌త్యేక హోదా లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ ఏపీ ఎంపీలు లోక్ స‌భ‌లో శ్రోత‌లు మాదిరిగా ఉండిపోయారు. ఏ మాత్రం పోరాటం దిశ‌గా ఆలోచించ‌లేదు. పార్టీల‌కు అతీతంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు పోరాటం చేయాల్సిన ఎంపీలు ఎవ‌రివారే నిమ్మకుండిపోవ‌డం గ‌మ‌నార్హం. ప‌లుమార్లు ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టం మీద పార్ల‌మెంట్ వేదిక‌గా టీడీపీ ఎంపీలు ప్ర‌శ్నించారు. ఈసారి కూడా ఎంపీ రామ్మోహ‌న్ రావు వేసిన ప్ర‌శ్న‌కు ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయంగా మ‌రోసారి కేంద్రం స్ప‌ష్టం చేసింది.ఏడేళ్లుగా చెబుతోన్న మాట‌నే మ‌ళ్లీ ఎంపీ రామ్మోహ‌న్ వేసిన ప్ర‌శ్న‌కు సమాధానంగా కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చెప్పాడు. పాత కథ‌నే మ‌ళ్లీ ఆయ‌న వినిపించాడు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి, ప్రత్యేక కేటగిరీ హోదా ఉనికిలో లేద‌ని తేల్చేశాడు.ఇదే విష‌యాన్ని ప‌లుమార్లు కేంద్రం చెప్పింది.2015-16 నుండి 2019-20 మధ్యకాలంలో రాష్ట్రానికి లభించే అదనపు కేంద్ర వాటాను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని, కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్‌ఎస్) నిధులతో పాటు ఏపీకి ప్రత్యేక సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంద‌ని తెలిపాడు. కేంద్రం మరియు ఏపీ మధ్య 90:10 నిష్పత్తి లో నిధులు అందిస్తుంద‌ని వివ‌రించాడు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నామ‌ని హోంశాఖ‌ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభ వేదిక‌గా స్ప‌ష్టం చేయడాన్ని గ‌మ‌నిస్తే ప్ర‌త్యేక హోదా లేన‌ట్టే అని కేంద్రం చెప్పింది. AP పునర్వ్యవస్థీకరణ (APR) చట్టం, 2014లోని ప‌లు అంశాల‌ను పెద్ద సంఖ్యలో అమలు చేశామని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు మరియు విద్యాసంస్థలకు సంబంధించిన కొన్ని నిబంధనల మేర‌కు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సుదీర్ఘ‌కాలం ప‌ట్ట‌వ‌చ్చ‌ద‌ని కేంద్రం తెలిపింది. ప‌దేళ్ల‌ను చ‌ట్టంలో సూచించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 25సార్లు ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌మీక్ష నిర్వ‌హించామ‌ని కేంద్రం తెలిపింది.