Site icon HashtagU Telugu

Amaravati ORR : అమరావతికి గుడ్ న్యూస్.. ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Amaravati Orr New Update

Amaravati ORR : ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ అందింది. 189 కిలోమీటర్ల పొడవైన అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రతిపాదనకు కేంద్ర సర్కారు ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు మోడీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఓఆర్‌ఆర్‌‌కు రెండు వైపులా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లు ఉంటుంది. 2018 జనవరి నాటి అంచనాల ప్రకారం అమరావతి  ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.17,761.49 కోట్లు ఖర్చవుతుంది. ఇందుకోసం 3,404 హెక్టార్ల భూమి అవసరం. భూసేకరణ కోసం రూ.4,198 కోట్లు అవసరం. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా.. నిర్మాణ వ్యయం రూ.25 వేల కోట్లు దాటిందని అంచనా వేస్తున్నారు.  కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక ఈ ప్రతిపాదనకు పూర్తిగా లైన్ క్లియర్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join

ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే..

ORR నిర్మాణం పూర్తయితే అమరావతికి(Amaravati ORR) ఏపీలోని ఇతర ప్రాంతాలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల సరిహద్దులతో కనెక్టివిటీ మెరుగు అవుతుంది. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.  విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ప్రస్తుతం 270.7 కి.మీ. పొడవైన జాతీయ రహదారి ఉంది.  ఈ జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా  70 కి.మీ. దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది.  మేదరమెట్ల-అమరావతి మధ్య 90 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని కూడా నిర్మించనున్నారు. ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం విరమించుకుంది. హైదరాబాద్, అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే హామీ విభజన చట్టంలోనూ ఉంది.

జగన్ హయాంలో..

గత జగన్ ప్రభుత్వం అమరావతి ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్‌ ప్రాజెక్టుల్ని పూర్తిగా అటకెక్కించింది.  జగన్ సర్కారు కేవలం విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారిని నిర్మించాలని కేంద్ర సర్కారును కోరింది. అయితే విజయవాడ చుట్టుపక్కల లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయిస్తే, విజయవాడ తూర్పుబైపాస్‌ రహదారి భూసేకరణకయ్యే వ్యయాన్ని భరిస్తామని  కేంద్రం అప్పట్లో తెలిపింది. కానీ జగన్‌ ప్రభుత్వం లాజిస్టిక్‌ పార్కుకు  భూమిని కేటాయించలేదు.  దీంతో అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు(chandrababu) చొరవ చూపడంతో ఆ ప్రాజెక్టులపై మళ్లీ ఆశలు చిగురించాయి.

Also Read :Tamil Nadu BSP Chief : తమిళనాడు బీఎస్పీ చీఫ్ దారుణ హత్య.. ఎలా జరిగిందంటే ?