Site icon HashtagU Telugu

Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం

Central approval for Amaravathi railway line

Central approval for Amaravathi railway line

Amaravati Railway Line : ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతికి 57 కి.మీ.ల మేర కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతోనే అమరావతి రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్ తెలిపారు. రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ రైల్వే లైన్‌తో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఈ రైల్వేలైన్‌ ఏర్పాటు కానుంది. ఏపీ, బిహార్‌ రాష్ట్రాలకు రెండు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి అంచనా వ్యయం మొత్తంగా రూ.6,798 కోట్లు. ఇందులో అమరావతి రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు

కాగా.. బిహార్‌లో రైల్వే లైన్‌కు రూ.4,553 కోట్లు కేటాయించింది. ఏపీలో కొత్త రైల్వే లైన్‌ అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య ఏర్పాటు కానుంది. అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు IN-SPACe ఆధ్వర్యంలో రూ.1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఫండ్ దాదాపు 40 స్టార్టప్‌లకు తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ప్రోత్సహం కల్పించేలా ఈ నిధి ఉపయోగపడనుంది.
బిహార్‌లో రూ.4,553 కోట్లతో నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా; సీతామర్హి-ముజఫర్‌పుర్ కారిడార్‌ డబ్లింగ్‌కు పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 256 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుతో ఉత్తరప్రదేశ్, ఉత్తర బిహార్‌లకు ప్రయోజనం చేకూరనుంది. నేపాల్‌ అంతర్జాతీయ సరిహద్దుకు సమాంతరంగా కొనసాగే ఈ రైల్వే లైన్‌.. కాఠ్‌మాండూ, జానక్‌పుర్‌, లుంబినీ మధ్య ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్‌, కంటెయినర్లను వేగంగా తరలించేందుకు ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఏపీ, బిహార్‌లలో చేపట్టే ఈ ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు.

Read Also: Singareni : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం