Special Status: బిగ్ ట్విస్ట్.. ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అంశం తొలగింపు!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది.

  • Written By:
  • Updated On - February 13, 2022 / 08:54 PM IST

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో తొలుత హోదా అంశాన్ని చేర్చారు. ఈ నెల 17న సబ్ కమిటీ తొలిసారి సమావేశం కానుంది. శనివారం ఉదయం ఎజెండాలోనేమో ఏపీ కి ప్రత్యేక హోదా అంశం ఉంది. కానీ, శనివారం సాయంత్రం హఠాత్తుగా కమిటీ ఎజెండా అంశాలను సవరించింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. అందులో ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశాన్ని తొలగించి, మార్పులు చేసింది. ఎజెండాలో మార్పు చేస్తూ మరో సర్క్యులర్‌ విడుదల చేసింది. సమావేశం ఎజెండాలో తొలుత ప్రత్యేక హోదా, పన్ను రాయితీలను కేంద్ర హోంశాఖ చేర్చింది.

అయితే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడిన తర్వాతనే పొరపాటును కేంద్ర హోంశాఖ గ్రహించినట్టుంది. సమావేశం అనేది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలకు మాత్రమే పరిమితమని జీవీఎల్‌ కు హోం శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిధిలోకి రాని స్పెషల్ కేటగిరి స్టేటస్, పన్ను రాయితీలు సహా మరికొన్ని అంశాలను ఎజెండా నుంచి తొలగించింది. సవరించిన ఎజెండాతో తాజా ఉత్తర్వులు విడుదల చేసింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేంద్రం ఫోకస్‌ చేసిన నేపధ్యంలోనే…. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ నెల 17న త్రిమెన్‌ కమిటీ మొదటిసారి సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ భేటీలో… ఎజెండాలోని అంశాలపై చర్చించనున్నారు. ఇక కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీ చేసిన తాజా సర్కులర్‌లో.. ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. కేవలం 5 అంశాలతో మాత్రమే ఎజెండా ను తయారు చేసింది.

తొలుత కమిటీ ఎజెండాలోని అంశాలు:

ఆంధప్రదేశ్ ఆర్థిక సంస్థ విభజన

ఏపీ, తెలంగాణ విద్యుత్‌ వినియోగం పరిష్కారం

పన్నులకు సంబంధించిన వాటిలో వ్యత్యాసాలను తొలగించడం

బ్యాంకుల్లో నగదు నిల్వ, డిపాజిట్ల విభజన

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పౌరసరఫరాల సంస్థల మధ్య క్యాష్‌ క్రెడిట్‌

వనరుల అంతరం

ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంటు

ఏపీ కి ప్రత్యేక హోదా అంశం

పన్ను రాయితీలు

సవరించిన ఎజెండా:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన

ఏపీ జెన్‌కో కి టీఎస్‌ డిస్కంల విద్యుత్‌ వినియోగ చెల్లింపుల బకాయిలు

పన్నుల విషయంలో తలెత్తిన వివిధ అంశాలు

బ్యాంకుల్లోని నగదు, డిపాజిట్ల విభజన

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల మధ్య క్యాష్‌ క్రెడిట్‌ అంశం.

ఏపీ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పై జీవీఎల్ క్లారిటీ:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జరగనున్న భేటీ ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సామాజిక మాధ్యమమైన ట్విటర్‌ ద్వారా స్పందించారు. కేంద్రం కొత్తగా సర్కులర్ జారీ చేయటానికి ముందు ట్విట్టర్ వేదికగా జీవీఎల్ నరసింహారావు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించానన్న జీవీఎల్‌.. కేంద్ర హోంశాఖ నోట్‌పై ఆరా తీసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశం రెండు రాష్ట్రాల కమిటీ ఎజెండాలో ఉండేది కాదని తెలిసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా? అన్న జీవీఎల్‌… ఈ విషయం ఆలోచిస్తే అర్ధమవుతుంది కదా అని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ నోట్‌ను తాను చూశానని, అధికారులతో మాట్లాడానని ఆ తరువాతే వివరణ ఇస్తున్నట్టు జీవీఎల్ తెలిపారు. ‘ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై చర్చ ఉంటుందని ప్రస్తావించిన తరుణంలో… దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్రంలోని సీనియర్‌ అధికారులతో మాట్లాడాను. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం మాత్రమే. రెవెన్యూ లోటు కూడా ఆంధ్రా కు మాత్రమే సంబంధించిన అంశం. ఈ రెండు అంశాలు జాబితాలోకి ఎలా వచ్చాయని ఆరా తీస్తే.. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో.. అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ అని తెలిసింది. ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు ఆస్కారం లేదని స్పష్టతనిచ్చింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవపట్టించే విధంగా ఉంది. అందుకే ఈ వివరణ ఇస్తున్నా’ అంటూ… జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తొలుత విడుదల చేసిన సర్క్యులర్ లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడంతో… సంబర పడిన ప్రజలకు, చివరకు ఆ అంశం లేదని తేలడంతో నిరాశ చెందడం తప్పలేదు.